జీవితాన్ని సార్ధకంచేసే క్రియాశీల సౌందర్యం

కందాళ శోభారాణి యాదిలో
2023 ఫిబ్రవరి 12… సూర్యాస్తమయం వేళ. కందాళ శోభారాణి చనిపోయిందన్న వార్త… విని భరించటం కష్టమే అయింది. ఇప్పటికీ తలపులో కదులుతూ గుండె నీరవుతునే ఉంది. 20 ఏండ్ల ఆత్మీయ అనుబంధం, సామాజిక సాహిత్య దృక్పథాల సాన్నిహిత్యం మాది. 49 ఏండ్ల అకాల మరణం ఆమెది.

శోభారాణి పుట్టింది 1973, ఏప్రిల్‌ 29న. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ఎమ్మెలో చేరటంతో తను నా విద్యార్థి అయింది. సన్నగా తగిన ఎత్తుతో తరగతి గది పాఠాలు వినటంలో శ్రద్ధను, ప్రశ్నలు వేసే సాహిత్య జిజ్ఞాసను చొరవను, చలాకీ తనాన్ని చూస్తూ ఉన్నానేమో శోభకు పెళ్లి అయిందని, ఒక కొడుకు ఉన్నాడని తెలిసినప్పుడు నమ్మలేకపోయాను. ఆడపిల్లలవి పెళ్ళిచదువులు, పెళ్లితో ఆగిపోయేవి అనుకొనే సమాజంలో పెళ్లి నా చదువుకు అడ్డం కాదు, తల్లికావటం అవరోధమూ కాదు అంటూ సరిహద్దులు విస్తరించుకొంటూ ఆమె అలా పై చదువుకు రావటం భలే ముచ్చటగా అనిపించింది. యూనివర్సిటీలో తనది వామపక్ష విద్యార్థి వర్గంతో స్నేహం. ఆమె జీవిత సహచరుడు రమేష్‌ పిడిఎస్‌యు రాజకీయాల నుండి వచ్చినవాడు కావడం, కమ్యూనిస్టు పార్టీ పెద్దలు పూనుకొని చేయించిన పెళ్లి (2002) కావటం అందుకు దోహదపడి ఉంటుంది.
విశ్లేషించాలనే తపన
తెలుగు ఎమ్మే విద్యార్థిగా ఉన్నప్పుడే శోభ సాహిత్యాన్ని పరీక్షలకు కాక అభిరుచితో చదవాలని, ఒక ప్రయోజనంతో విశ్లేషించాలని తపన పడటం చూసాను. బయటి విశ్వ విద్యాలయాల నుండి ఎవరు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చినా, పత్రసమర్పణ చేస్తున్నా వినే తీరు, నోట్స్‌ రాసుకొనే తీరూ మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో… వచ్చిన దానిని పూర్తిగా వినియోగించుకోవాలి అన్నట్లు ఉండేది. తెలుగువిభాగంలో ఏడాదికి ఒక సెమినార్‌ తప్పనిసరిగా జరిగేది. అధ్యాపకులు, విద్యార్థులు కలిసి చేసుకొనే గొప్ప ఉత్సవం అది. మా అధ్యాయనానికి, పరిశోధనకు పనికివచ్చేదిగా, విద్యార్థుల అధ్యయనానికి దిశానిర్దేశం చేసేదిగా ఉండేట్లు సెమినార్లకు అంశాలను నిర్దేశించుకొనేవాళ్ళం. ఆ రకంగా పురాణ సాహిత్యం మీద సెమినార్‌ పెట్టాం ఆ సంవత్సరం. సెమినార్‌లో పరిశోధక విద్యార్థులకు పత్ర సమర్పణ అవకాశం ఇస్తాం. అయితే ఆ సంవత్సరం ఎమ్మే విద్యార్థులకు కూడా దానిని విస్తరింప చేద్దామని అనుకొన్నాం. ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక సెషన్‌ కేటాయించాం. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కలిసి ఒక పత్రం తయారుచేయాలని అనుకున్నాం. అలా శోభ, శ్యామల, వేదవతి ముగ్గురు కలిసి స్కాంధ పురాణంలోని కౌమారికాఖండంపై పత్రం రాసి ఆ సెమినార్‌లో సమర్పించారు. వాళ్ళ పని పర్యవేక్షణ నాదే కనుక అంశాన్ని ఎన్నుకొన్న దగ్గర నుండి ఆ పురాణ భాగాన్ని చదవటం, నిఘంటువులు చూసి తెలియని పదాలకు అర్ధాలు తెలుసుకొంటూ అన్వయించుకొంటూ అర్ధం చేసుకొనటం ఈ మొత్తం క్రమంలో వాళ్ళ ఉత్సాహం ప్రత్యక్షంగా చూసాను. అందుకనే శోభ పీహెచ్‌డీ డిగ్రీ కోసం పరిశోధన నా పర్యవేక్షణలో చేస్తానంటే ఇష్టంగా ఒప్పుకున్నాను.
జండర్‌ స్పృహను పెంచుకొంది
2006లో శోభ ఎమ్మె అయిపొయింది. అదే సంవత్సరం నేను యూనివర్సిటీ ఉమెన్‌ స్టడీస్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలు తీసుకొన్నాను. ఆ సంవత్సరమే పంచాయతీరాజ్‌ ఎన్నికలు ప్రకటించారు. అందులో 33 శాతం సీట్లు మహిళలకు కదా… వాళ్ళ రాజకీయ చైతన్య స్థాయిపై జిల్లా స్థాయి సర్వే సెంటర్‌ పక్షాన చేయాలనుకున్నాం. అందుకోసం అన్ని పంచాయితీలకు వెళ్లి సిద్ధం చేసిన ప్రశ్నావళి ప్రకారం సమాచారం సేకరించటానికి వెళ్ళాలి అని చెప్పగానే సిద్ధం అంటూ వచ్చిన యూనివర్సిటీ విద్యార్థులలో శోభ ఉంది. పంచాయితీ మెంబర్లుగా పోటీలో నిలబడ్డ స్త్రీలను కలిసి మాట్లాడి రావటంలో ఎదురైన అనుభవాలను గొప్ప భావోద్వేగంతో తాను పంచుకొన్న తీరు నాకు ఇప్పటికీ గుర్తే. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎంపికైన సర్పంచ్‌లకు తదితర స్థానిక ప్రభుత్వ పాలనాధికారులకు డివిజన్‌ వారీగా ఏర్పాటు చేసిన సభలకు కూడా శోభా వస్తుండేది. స్థానిక పాలనలో స్త్రీల సాధికారతలోని వాస్తవం పాలు ఎంతో, మాయ ఎంతో ఆ సందర్భం మాకు బాగా తెలియ పరిచింది. సెంటర్‌ కార్యక్రమాలలో భాగం అవుతూ జండర్‌ స్పృహను పెంచుకొంది.
రాజకీయ అవగాహన కోసం
చదువుకొంటున్న కాలంలో అభివృద్ధి చెందిన వామపక్ష దృక్పథం వల్లనే ఆమె బుర్ర రాములు ప్రభావంలోకి వెళ్ళింది. 2008లో నా దగ్గర పరిశోధనకు చేరేనాటికి మానవ హక్కుల వేదిక సభ్యురాలై వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది. నిజ నిర్ధారణ కమిటీలలో భాగమై అనేకచోట్లకు తిరిగింది. ఉద్యమ అవసరాల రీత్యా సామాజిక రాజకీయ విషయాల అవగాహన కోసం అధ్యయనాలు చేసింది. అదే సమయంలో తన సాహిత్య ఆసక్తులకు తగ్గట్లుగా సాహిత్య సంస్థలతో, వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది.
సమానత్వం కోసం
శోభ సాహిత్య అధ్యయనం సమకాలీన సామాజిక సందర్భాలు, అవసరాలబట్టి రూపొందుతూ వచ్చింది. దోపిడీ, పీడన, ఆర్ధిక అసమానతలు లేని సమాజంకోసం వర్గపోరాటాల అవసరాన్ని, అనివార్యతను గుర్తించింది కనుక అభ్యుదయ విప్లవ సాహిత్యాలకు అభిమాని అయింది. నూతన ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ పెనుముప్పు సంస్కరణలు, అభివృద్ధి పేరిట దోపిడీనీ అసమానతలను పెంచి పోషిస్తాయి అని అర్ధమయ్యే కొద్దీ వాటికీ వ్యతిరేక చైతన్యాన్ని ప్రోదిచేసే సాహిత్యం వైపు దృష్టి పెట్టింది. అదే సమయంలో ఈ అసమానతలలో భాగంగా స్త్రీపురుష వివక్ష అనేది కొనసాగుతుండగా స్వీయ అస్తిత్వ చేతనతో గొంతెత్తకుండా ఉండలేకపోయింది.
స్త్రీల సాహిత్య విమర్శ
ఉత్పత్తి, పునరుత్పత్తి శక్తి కూడా అయిన మహిళ సామాజిక సాహిత్య, కళా, రాజకీయ రంగాలలో ప్రతిభావ్యుత్పత్తులు లేనిదానిగా ఉపాంతీకరణకు గురై చరిత్రలో మిగలకుండా పోతున్న తలకిందులు స్థితిని సరి చేయటం సాహిత్య విద్యా సాంస్కృతిక ఉద్యమంగా కొనసాగుతున్న సందర్భంలో శోభ పరిశోధన స్త్రీల సాహిత్యం కేంద్రంగా ఉండాలని, స్త్రీల సాహిత్య విమర్శ ఇప్పటివరకు ఎవరూ స్పృశించని అంశం కనుక పరిశోధనాంశం అదే చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. అదే సమయంలో (2009-2011) తెలుగులో స్త్రీల సాహిత్యం 1900-1950 అనే అంశంపై నాకు వచ్చిన యూజీసీ మేజర్‌ రీసర్చ్‌ ప్రాజెక్ట్‌లో ప్రాజెక్ట్‌ ఫెలోగా పనిచేస్తూ ఈ పరిశోధన కొనసాగించింది. వేరువేరు ప్రాంతాలలో లైబ్రరీలకు తిరిగి సమాచారం సేకరించుకు రావటంలో వాటిని కార్డులపై నమోదు చేయటంలో శోభ చూపిన శ్రద్ధ, ఇష్టం ఆమె పనిని ఎంతగా ప్రేమించిందో చెప్తాయి. ‘తెలుగుసాహిత్య విమర్శ – స్త్రీల కృషి’ అనే అంశంపై శోభ రాసి డాక్టరేట్‌ పొందిన సిద్దాంత గ్రంథాన్ని తెలుగు అకాడెమీ ప్రచురించింది. రెఫెరెన్స్‌ గ్రంథ గౌరవాన్ని పొందిన పుస్తకం అది. వ్యాస శోభిత, తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు, సాహిత్యావలోకనం అనే మరో మూడు వ్యాస సంపుటాలు కూడా ప్రచురించింది శోభ.
కుటుంబం కోసం…
పరిశోధన కాలంలో శోభా నేను కలిసి గడిపిన కాలం ఎక్కువ. సెమినార్లకు కలిసి చేసిన ప్రయాణాలు కూడా ఎక్కువే. పరిశోధన గురించి, తాను సెమినార్లకు రాసే పేపర్ల గురించి చర్చలు ఎంత సుదీర్ఘంగా నడిచేవో.!? రాసింది సరిచూసుకొంటూ ఎన్నెన్ని గంటలు గడిచిపోయేవో. మధ్యమధ్యలో చారు తాగుతూనో.. తింటూనో వ్యక్తిగత, కుటుంబిక జీవితానుభవాల ముచ్చట్లు కూడా నడిచేవి. అప్పుడే నాకు తెలిసింది శోభ జీవితం నల్లేరు మీద బండినడక కాదని. ఇంటర్‌ చదువు పూర్తి అవుతూనే అన్నలిద్దరూ పట్టించుకోకుండా వదిలేసిన తల్లిదండ్రుల బాధ్యత భుజానికి ఎత్తుకుంది. 200 రూపాయలకు తాను పుట్టి పెరిగిన పాపయ్య పేటలోనే ప్రభుత్వ పాఠశాలలో పారా టీచర్‌గా పనిచేస్తూ, కారం మిల్లు నడుపుతూ చెల్లెలిని, తమ్ముడిని కూడా చదివించింది. వాళ్ళను చదివిస్తూనే తాను బిఎ పూర్తిచేసింది. 2002లో పెళ్లయ్యాక రమేష్‌ స్నేహితులు వెంకన్న, వెంకట రమణ(యాకయ్య), గిన్నె రాజు ఇచ్చిన సహకారాలతో తెలుగు ఎమ్మె ప్రవేశ పరీక్ష రాసానని మెరిట్‌ లిస్టులో మొదటి ఐదుగురిలో తాను ఉన్నానని ఆ రకంగా ఇలా మీ అందరి సహవాసంలోకి వచ్చానని చెప్తుండేది.
మనలో మనం
శోభకు నాకు మరొక అనుబంధం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. భిన్న అస్తిత్వాలతో ఉన్న రచయిత్రుల మధ్య సంభాషణకు, స్నేహానికి, సామాన్య సూత్రాన్ని, ప్రాతిపదికను చర్చలోకి తీసుకొనిరావటానికి 2009లో విశాఖ పట్నంలో జరిగిన ‘మనలో మనం’ సభలకు వరంగల్‌ నుండి వెళ్లిన మా బృందంలో శోభ కూడా ఉన్నది. మనలో మనం అనే పేరుతోనే యాడాది పాటు స్త్రీల సాహిత్యాన్ని కులమత ప్రాంతీయ అస్తిత్వ కోణాలనుండి అధ్యయనం చేయాటాన్ని అలవాటు చేసుకొంటూ, ప్రచారం చేస్తూ తెలంగాణ, కోస్తాఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రలలో చేసిన నాలుగు సెమినార్లకు తాను వచ్చింది. ప్రసంగ వ్యాసాలు సమర్పించింది. 2010లో అదే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అయితే దానితోపాటే నడిచింది. అందుకోసం చేసిన అధ్యయనాలు, ప్రయాణాలు పరిశోధన తర్వాత కూడా మా స్నేహ సంబంధాలను సజీవంగా ఉంచాయి. అదే సమయంలో యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో పార్ట్‌ టైం లెక్చరర్‌గా చేరటంతో శోభ నా సహాధ్యాపకురాలు కూడా అయింది.
చురుకైన భాగస్వామ్యం
శోభ వ్యక్తిత్వంలో మరొక అంశం 2009 తర్వాత మలిదశ తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో చురుకైన భాగస్వామ్యం. రాస్తారోకోలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు, రహదారులపై వంటావార్పు, రాష్ట్ర సాధన దీక్షా శిబిరాలు… ఒకటేమిటి అన్నిటా తానై తిరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలలో భాగమైంది. కవిత్వాన్ని ఆయుధంగా పదునెక్కించిన కాలం ఇది. కవిత్వం రాయటమే కాదు, కవి సమ్మేళనాలలో పాల్గొనటమే కాదు తెలంగాణ కోసం ఏర్పడిన వరంగల్‌ రచయితల ఐక్యవేదిక పనులలో చురుకైన భాగస్వామ్యం తనది. ఆ సంస్థ పక్షాన ప్రచురించబడిన ”తెలంగాణా ఉరుములు-మెరుపులు” అనే కవితా సంకలనం సంపాదకవర్గంలో శోభ కూడా ఉంది. ఆ కాలంలోనే వరంగల్‌లో ఏర్పడిన ”గోదావరి సాహితీ మిత్రులు” సమూహంలోనూ తానున్నది. ”ప్రపంచం ఒక పద్మవ్యూహం” అని తెలిసి కవిత్వం ఒక తీరని దాహంగా జీవించించింది శోభ.
అనారోగ్యం వేధిస్తున్నా…
మైగ్రేన్‌ లాంటి సమస్యలున్నా తోసేసుకొంటూ తిరిగిన శోభ రెండవ ప్రసవం తర్వాత గర్భకోశ సంబంధమైన ఇబ్బందులతో, రక్త హీనతతో బాధపడుతూ వచ్చింది. కీళ్ల నొప్పులు దానికి తోడయ్యాయి. అదే ఆమెను సామాజిక సంస్థాగత కార్యక్రమాలలో ఇదివరకంతటి చురుకుగా పాల్గొననియ్యని పరిమితి అయింది. అయినా ఆమె ఎక్కడా ఆగలేదు. కరోనాకాలంలో అంతర్జాల సమావేశాలు ఏవి జరిగినా వాటిల్లో పాల్గొన్నది. స్త్రీల నవలల మీద శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వాళ్ళు పెట్టిన సదస్సులో రంగనాయకమ్మ ‘కళ్ళు తెరిచిన సీత’ నవల మీద మాట్లాడింది. లత నవలలు మీద వంశీ రామరాజు గారు పెట్టిన సదస్సులో నా దగ్గర నుండే ఒక నవల తీసుకొని వెళ్లి పేపర్‌ సమర్పించింది. మార్క్సిస్టు సాహిత్య విమర్శపై జిజ్ఞాసవేదిక నిర్వహించిన అంతర్జాల ప్రసంగాల పరంపరను క్రమం తప్పకుండా వింటూ ఎంత బాగున్నాయి మేడం ప్రసంగాలు అంటూ ఫోన్‌ చేసి సంతోషాన్ని పంచుకొనేది. ఆ తర్వాత స్త్రీవాద సాహిత్య విమర్శపై ప్రజాస్వామిక వేదిక, జిజ్ఞాస కలిసి నిర్వహించిన అంతర్జాల ప్రసంగాల పరంపరలో స్త్రీల సాహిత్య విమర్శపై కృషి చేసిన శోభ ఒక ప్రసంగం చేయకపోతే ఎలా అని తన ఆరోగ్య పరిమితులు తెలిసి కూడా తనను అడిగాను. తప్పకుండా మాట్లాడతా… పుస్తకాలు తెప్పించుకొంటా… మంచం మీద పడుకొని అయినా సరే చదువుకొంటా.. రాసుకొంటా.. మాట్లాడతా అని దృఢంగా చెప్పింది. ”ఆధునిక తెలుగు సాహిత్యం – స్త్రీ చైతన్యం (1911-1935)” అనే అంశం మీద 2022 సెప్టెంబర్‌ 18న ఆమె చేసిన ప్రసంగం యుట్యూబ్‌లో లభిస్తున్నది.
మరువలేని జ్ఞాపం
ఆరోజు తెరమీద కనబడిన శోభ అక్టోబర్‌లో బతకమ్మ పండుగ రోజుల్లో మా ఇంటికి వచ్చింది. అప్పటికి ఆమె యూనివర్సిటీలో మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌కి డైరెక్టర్‌ అయింది. యూనివర్సిటీ మహిళా కళాశాలనుండి యూనివర్సిటీ విభాగానికి బదిలీ అయింది. జ్యోతిరావు పూలే సెంటర్‌లో పరిశోధన కార్యక్రమాలు ఏమి చేపట్టవచ్చో చర్చించటానికి వచ్చింది. కీళ్ల నొప్పుల బాధ, నీరసం మొహం మీద కనబడుతున్నా వాటిని తరిమేసే కార్యోత్సాహమే ఆమె ముఖాన్ని వెలిగింప చేయటం చూసాను. సెంటర్‌ పనులలో తోడుగా ఉంటానని నా దగ్గర నుండి మాట తీసుకొని వెళ్లిన శోభ మూడు నెలలలో ఇలా వెళ్ళిపోతుందని ఎలా అనుకోగలను!? చదవటం, రాయటం ఉఛ్వాస నిశ్వాసాలుగా, క్రియాశీల సౌందర్యమే జీవితంగా బతికిన శోభ నాకు మరువలేని జ్ఞాపకం.
– కాత్యాయనీ విద్మహే

Spread the love