ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లల అవగాహన అభినందనీయం: సజ్జనార్

నవతెలంగాణ – హైదరాబాద్ :  టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఓ ప్రభుత్వ పాఠశాల పిల్లలు రూపొందించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ‘చిన్నతనంలో ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లలు అవగాహన కల్పిస్తోన్న తీరు అభినందనీయం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు, టీచర్స్ వారిలో సామాజిక స్పృహను నింపాలి’ అని ఆ వీడియో కింద సజ్జనార్ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు.
అలాగే రోడ్, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ అనే పదాలతో హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు. ఈ వీడియోలో ముందుగా ఫోన్ చూస్తూ రోడ్డు దాటడం, జీబ్రా క్రాసింగ్ పైన కాకుండా దానికి కొంచెం ముందు నుంచే రోడ్డు దాటడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను పిల్లలు కళ్లకు కట్టినట్లు చూపారు. అదే ఒకవేళ రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్ మీద నడుస్తూ వాహనదారుడికి చేయి చూపిస్తే ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఆ తర్వాత రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఓవైపు పాదచారులు రోడ్డు దాటుతున్నా ఆగకుండా వాహనాన్ని పోనివ్వడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో విద్యార్థులు తెలియజేశారు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగి, గ్రీన్ సిగ్నల్ వచ్చాక వాహనదారులు ముందుకు కదిలితే ఎంత సురక్షితంగా గమ్యం చేరొచ్చో విద్యార్థులు నటించి చూపారు. అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రమాదానికి గురైతే లేదా హెల్మెట్ ధరించినప్పుడు ప్రమాదం జరిగితే ఎలా క్షేమంగా బయటపడొచ్చో స్టూడెంట్స్ చూపారు. వీడియోలో చివరగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో విద్యార్థులు చూపించారు.

 

Spread the love