నగరాలు, పట్టణాలలో గ్రీనరీ అభివృద్ధ్దికి ప్రాధాన్యత :సీఎస్‌ శాంతి కుమారి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అర్బన్‌ పార్కుల ఏర్పాటు, గ్రీనరీ గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోనూ వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్కె భవన్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎస్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హెచ్‌ ఎండీఏ, జీహెచ్‌ ఎంసీ, జలమండలి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌, రేరా విభాగాల ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ అభివద్ధి పథకాలపై పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌ ద్వారా సంబంధిత అధికారులు సీఎస్‌కు వివరించారు. అనంతరం శాంతికుమారి మాట్లాడుతూ, దేశంలోనే అత్యధిక నగర జనాభా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందనీ, రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలలో తాగునీటి సరఫరా, హరిత హారం, అంతర్గత రహదారుల నిర్మాణం, స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలు, కనీస మౌలిక సదుపాయాల కల్పన తదితర ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ తోపాటు శివారు ప్రాంతాల్లో 14 అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయడం, హరిత హారం కింద పెద్ద ఎత్తున గ్రీనరీని అభివృద్ధి చేయడాన్ని ఆమె అభినందించారు. రాష్ట్రంలో హరిత హారంకింద భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నదనీ, పట్టణ ప్రాంతాల్లో దీన్ని మరింత అధికంగా చేపట్టేందుకు ప్రాధాన్యత నివ్వాలని ఆదేశించారు. మే లోగా హైదరాబాద్‌లో చేపట్టిన నాలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ శాఖకు సంబందించిన పెండింగ్‌ అంశాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా సీఎస్‌ ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, జలమండలి ఎండీ దాన కిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, మున్సిపల్‌ శాఖ కమీషనర్‌ డా.సత్యనారాయణ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండి ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Spread the love