వైభవంగా దశాబ్ది ఉత్సవాలు

– ఏర్పాట్లపై సీఎస్‌ శాంతికుమారి సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారుల్ని ఆదేశించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా పూర్తిచేయాలని, నిర్వహణలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు. బుధవారంనాడామె డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలంయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్‌కుమార్‌, సునీల్‌శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ సీవీ ఆనంద్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర సచివాలయ ఆవరణలో మొదటిసారిగా ఈ ఉత్సవాల ప్రారంభో త్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.
దీనికి ప్రజాప్రతినిధులు, సచివాలయ, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున సచివాలయంలోకి వారి ప్రవేశం, వాహనాల పార్కింగ్‌, భద్రతా ఏర్పాట్లను జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పారు. సెర్మోనియల్‌ పరేడ్‌ నిర్వహణ, జాతీయ పతాకావిష్కరణ ఏర్పాట్లు చేయాలన్నారు. షామియానాలు, సీటింగ్‌ ఏర్పాట్ల బాధ్యతల్ని రోడ్లు, భవనాల శాఖ అధికారులు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయం, రాజ్‌భవన్‌, శాసనసభతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలను విధ్యుత్‌ దీపాలతో అలంకరించాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో గన్‌పార్క్‌ లోని అమరవీరుల స్థూపానికి ఫ్లోరల్‌ డెకరేషన్‌ చేపట్టాల న్నారు. సమావేశ ప్రాంగణంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటు, పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టం ఏర్పాట్లు చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమీషనర్‌ను ఆదేశించారు. నగరంలోని చార్మినార్‌, క్లాక్‌ టవర్‌ తదితర ప్రముఖ భవనాలను ఉత్సవాలు జరిగే 21 రోజులపాటు విధ్యుత్‌ దీపాలతో అలంకరించాలని మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. మంచినీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు చెప్పారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత శాఖలు నోడల్‌ అధికారులను నియమించుకోవాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర హౌం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, కార్యదర్శులు రాహుల్‌ బొజ్జా, శ్రీనివాసరాజు, సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎస్‌ఏఎం రిజ్వి, అడిషనల్‌ డీజీ సంజరుకుమార్‌ జైన్‌, జైళ్ల శాఖ డీజీ స్వాతి లక్రా, జలమండలి ఎమ్‌డీి దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ లోకేష్‌ కుమార్‌, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమీషనర్‌ అశోక్‌ రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love