నేటి నుంచి మూడు వారాలపాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

– సచివాలయంలో పతాకావిష్కరణ చేయనున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఆవిర్భావానికి తొమ్మిదేండ్లు పూర్తయి.. పదో వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ… దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రం సిద్ధమైంది. శుక్రవారం నుంచి మూడు వారాల(ఈనెల 22 వరకు)పాటు నిర్వహించబోయే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్దగల అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్‌ ఉదయం 8 గంటలకు నివాళులర్పిస్తారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం ద్వారా ఆయన దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. నూతన సచివాలయ ప్రారంభం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నిర్వహించబోయే మొట్టమొదటి అధికారిక కార్యక్రమం ఇదే. సంబంధిత ఏర్పాట్లను సీఎస్‌ శాంతికుమారి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ అశోక్‌రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిర్వహించే వేడుకల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

Spread the love