నేటి నుంచి షాదాన్‌ ఆస్పత్రిలో ఉచిత మెగా హెల్త్‌ క్యాంపు

– హాస్పిటల్‌ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యామిలీ హెల్త్‌ కార్డులు : షాదాన్‌ ఎండీ, డాక్టర్‌ సారిబ్‌ రసూల్‌ ఖాన్‌
నవతెలంగాణ-ధూల్‌పేట్‌
షాదాన్‌ వైద్య కళాశాల ఏర్పాటుచేసి 20ఏండ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నుంచి ఉచిత మెగా హెల్త్‌ క్యాంపు నిర్వహించనున్నట్టు షాదాన్‌ సొసైటీ నిర్వాహకులు షాదాన్‌ విజారత్‌ రసూల్‌ ఖాన్‌ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 15 వరకు షాదాన్‌ హాస్పిటల్లో జరిగే ఈ ఉచిత హెల్త్‌ క్యాంపులో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తామని పేర్కొన్నారు. కులమతాల పట్టింపు లేకుండా నిరుపేదలకు రోగాల నుంచి విముక్తి కల్పించి ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించడమే ఈ వైద్య శిబిరం ప్రధాన ఉద్దేశమన్నారు. షాదాన్‌ హాస్పిటల్‌ ప్రారంభమైన మొదటి ఏడాది నుంచే ఏడాదికి రెండు సార్లు ఉచిత హెల్త్‌ క్యాం పులు నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. షాదాన్‌ సొసైటీ వైస్‌ చైర్మెన్‌ ఏజాజు రెహ్మాన్‌, సొసైటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సారిబ్‌ రసూల్‌ ఖాన్‌లు మాట్లాడుతూ.. క్యాంపు చివరి రోజు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారందరికీ ఫ్యామిలీ హెల్త్‌ కార్డులు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్డుల ద్వారా కుటుంబంలోని సభ్యులంతా ఏడాది పాటు ఉచిత వైద్యాన్ని పొందవచ్చన్నారు. ఈ 20 ఏండ్ల కాలంలో 25 లక్షల మందికి ఉచిత వైద్యమందించామన్నారు. ప్రతీ ఆరు నెలలకోసారి జరిగే ఈ మెగా హెల్త్‌ క్యాంపులో నగర ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూలలతోపాటు కశ్మీర్‌, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యాన, మధ్యప్రదేశ్‌, జార్ఖాండ్‌ రాష్ట్రాల నుంచి ప్రజలు ఉచిత వైద్య సేవలందుకున్నారని ఆయన పేర్కొ న్నారు. క్యాంపులో వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడమే కాకుండా అవసరమైన రోగులకు పలు రకాల శస్త్ర చికిత్సలు చేస్తున్నామన్నారు. ఎంతోమందికి కిడ్నీ, ఎముకల సర్జరీలు చేశామన్నారు. గర్భ సంచి ఆపరేషన్‌, నార్మల్‌, సిజీరియన్‌ డెలివరీలు కూడా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తు న్నామన్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి క్యాలిఫైడ్‌ డాక్టర్ల పర్యవేక్షణలో ఉచిత వైద్యమందిస్తున్నామని చెప్పారు.
ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగానే..
ఫ్రీ మెగా హెల్త్‌ క్యాంపులో ఖరీదైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగానే చేస్తున్నామని, రోగులు సద్వినియోగం చేసుకోవాలని సారిబ్‌ రసూల్‌ ఖాన్‌ కోరారు. అల్ట్రా సౌండ్‌ ఇమేజింగ్‌, 2డి ఎకో, రేడియాలజీ ఎమ్మారై స్కాన్‌ లాంటి పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు.
స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో..
యూరాలజీ (మూత్రాశయం), కార్డియాలజీ (గుండె), నెఫ్రాలజీ (కిడ్నీ), ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని తెలిపారు.
ఉచిత రవాణా..
సిటీలోని పలు ప్రాంతాల నుంచి రోగుల రవాణా కోసం ఉచిత బస్సుసౌకర్యం ఏర్పాటు చేశామని సారిబ్‌ రసూల్‌ ఖాన్‌ చెప్పారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని రవాణా తదితర వివరాలకు హెల్ప్‌ లైన్‌ నెంబర్లు 9676311747, 8686285796, 9849019535, 9000988544, 9985230806, 9885751975, 9866606046, 9966112448, 7032414388 లకు ఫోన్‌ చేయవచ్చన్నారు.

Spread the love