పేదల కడుపు కొట్టి పెద్దలకు

– ప్రజావ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్‌
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజావ్యతిరేకంగా ఉందని, పేదల కడుపుగొట్టి, పెద్దలకు పెట్టిన చందంగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని సీపీఐ(ఎం) కార్యాలయం అరిబండి భవన్‌లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టానికి భారీగా కోతలు పెట్టిన కేంద్ర సర్కార్‌ కార్పొరేట్‌ శక్తులకు ఇప్పటికే ఇస్తున్న రూ.లక్షల కోట్ల సబ్సిడీలకు అదనంగా మరో రూ.35 వేల కోట్లు పెంచడం దారుణమన్నారు. పన్ను పరిధిని రూ.5లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం మినహా ఏ ఒక్కటి దేశ ప్రజలకు మేలు చేసే విధంగా లేవని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని కొన్నేండ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా మోడీ సర్కార్‌ పెడచెవిన పెట్టడాన్ని తప్పుపట్టారు. ఎల్‌ఐసీలో వాటాలను అదానికి అమ్మడంతో ఒక్క రోజులోనే రూ.18 లక్షల కోట్ల ప్రజల డబ్బు ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించడానికి ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకపోవడం వీరి నిరంకుశపాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఉండి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తులన్నింటిినీ కలుపుకువెళ్లడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలైన పోడు భూములకు హక్కు పత్రాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం, ఖాళీ జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల హామీని రూ.5 లక్షలకు పెంచాలని, గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవారికీ ఇంటి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ధరణిలో సమస్యలు ఉన్నాయని, 9 లక్షల ఎకరాల భూమి రికార్డులు పెండింగ్‌లు ఉన్నాయని వీటన్నింటినీ పరిష్కరించాలని కోరారు. సమస్యను పరిష్కరించే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ(ఎం) రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా మూడో ఫ్రంట్‌ అనే వాదనను తోసిపుచ్చారు. అనంతరం పార్టీ నేరేడుచర్ల పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్‌ ఇంటికెళ్లి ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలేసి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు, కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు, ధీరావత్‌ రవినాయక్‌, నాగారపు పాండు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టపల్లి సైదులు, కోట గోపి తదితరులు ఉన్నారు.

Spread the love