బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (బీఎల్‌ఎస్‌) విధానాలు, సీపీఆర్‌ చేయడంపై ప్రాక్టికల్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇటీవలి కాలంలో కార్డియాక్‌ అరెస్టులు, గుండెపోటు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్కన ఉన్నవారు ఎవరైనా వీటికి గురైనప్పుడు వారిని తక్షణం కాపాడే అవకాశం సామాన్య ప్రజలకు కూడా ఉంటుంది. ఇందుకు వాళ్లకు కేవలం కొద్దిపాటి శిక్షణ ఉంటే సరిపోతుంది. అలాంటి శిక్షణనే సెంచురీ ఆస్పత్రి వైద్యులు పలువురు విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఇచ్చారు. శనివారం ఉదయం 10.30 నుంచి 12.30 వరకు రెండు గంటల పాటు పెద్దసంఖ్యలో వచ్చిన వారందరికీ బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (బీఎల్‌ఎస్‌) విధానాలు, సీపీఆర్‌ చేయడం ఎలాగో ప్రాక్టికల్‌గా వివరించారు. కేవలం థియరీ మాత్రమే చెప్పి వదిలేస్తే సరిగ్గా చేయడం రాదన్న ఉద్దేశంతో.. బొమ్మలను (మానెక్విన్స్‌) తీసుకొచ్చి, సరిగ్గా ఏ ప్రాంతంలో ఒత్తిడి ఇవ్వాలో, ఎంతసేపు, ఎలా సీపీఆర్‌ చేయాలో చూపించడమే కాక.. స్వయంగా వారందరితోనూ చేయించారు. ఒకసారి తప్పుగా చేస్తే, దాన్ని సరిచేసి, మళ్లీ చేయించడం ద్వారా పూర్తిస్థాయిలో వారు ప్రాణరక్షణకు సిద్ధమయ్యేలా చూశారు. వివరాలను ఆస్పత్రికి చెందిన క్రిటికల్‌ కేర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ శరణ్‌ రెడ్డి వివరించారు. ”అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, ఎవరైనా కార్డియాక్‌ అరెస్టుకు గురైనప్పుడు వెంటనే గుండెకు సరిగా రక్తప్రసారం అవుతోందో లేదో చూసుకోవాలి. ముందుగా అసలు రోగి స్పందిస్తున్నారో, లేదో చూసుకోవాలి. పది సెకన్లలోగా రక్తప్రసారం ఉందో లేదో చూడాలి. అసలు స్పందించని పక్షంలో వెంటనే 108కి ఫోన్‌ చేసి చెప్పాలి. ఈలోపు వాళ్లను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాలి. అంటే రోడ్డు మధ్యలో పడిపోయి ఉంటే.. రోడ్డు పక్కకి తరలించాలి. అప్పుడు సీపీఆర్‌ మొదలుపెట్టాలి. అది ఎంత వేగంగా చేయగలిగితే అంత మంచిది. గుండెపోటు వచ్చిన మూడు నాలుగు నిమిషాల్లోపు సీపీఆర్‌ చేయగలిగితే, రోగిని బతికించగలిగే అవకాశాలు 90-95శాతం ఉంటాయి. దీని గురించి ముందుగా కంప్రెషన్స్‌.. అంటే రొమ్ము ఎముక వద్ద నిమిషానికి 100-120 సార్లు 5-6 సెంటీమీటర్లు లోపలకి గట్టిగా ఒత్తాలి. అప్పుడు రక్తప్రసారం మళ్లీ మొదలవుతుంది. 30 సార్లు ఒత్తిన వెంటనే రెండుసార్లు శ్వాస కూడా ఇవ్వాలి. అలా చేస్తుండగా ఎమర్జెన్సీ సిబ్బంది వచ్చి, వాళ్లు ఏఈడీ అనే పరికరంతో షాక్‌ ఇవ్వాలా, అక్కర్లేదా అనేది చూస్తారు. అవసరమైతే షాక్‌ ఇస్తారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెఎన్సీ ఫిజిషియన్‌ డాక్టర్‌ సందీప్‌ రెడ్డి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ పర్వీన్‌, ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ చైతన్య, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్టు డాక్టర్‌ సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love