కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..

– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– దివ్యంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేసిన మంత్రి..
– విద్యార్థుల చదువుల్లో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలి..
నవతెలంగాణ – మీర్ పేట్
మన ఊరు మనబడి కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపికైన మీర్ పేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో పునర్నిర్మాణం చేసిన తరగతి గదులను విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. కేవలం సదుపాయాల కల్పన కాకుండా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన సులభతరమైన అభ్యసన బోధనాల కోసం తొలిమెట్టు అనే కార్యక్రమం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సులభతరంగా పాఠ్యాంశాలు బోధించేందుకు ఉపాధ్యాయులకు చాలా ఉపయోగపడిందని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సైతం ఇంగ్లీష్ మీడియంలో చదివేందుకు అవకాశం కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం బోధన కూడా అన్ని పాఠశాలల్లో ప్రారంభించినట్లు చెప్పారు. కేవలం ఉపాధ్యాయుల బోధనే కాకుండా విద్యార్థుల చదువు పట్ల వారి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్, రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుసింధర్ రావు, మున్సిపల్ కమిషనర్ వాణి, మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య, ఎంఈఓ కృష్ణ, స్థానిక కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love