104 వాహన సిబ్బంధిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి: సీపీఐ(ఎం)

CPIM-Logoనవతెలంగాణ – హైదరాబాద్
రద్దు అయిన 104 వాహన సిబ్బంధిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించి, వారి సేవలకు తగ్గ జీతభత్యాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలంగాణ ప్రభుత్వాని డిమాండ్ చేసింది. 2008 సంవత్సరంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 104 సేవలను ప్రారంభించింది. పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి దీర్ఘకాలిక వ్యాధులకు మందులనిస్తూ, టెస్టులు చేస్తూ మెరుగైన సేవలందించింది. కానీ పల్లెదావఖానాలు, ఇంటింటికీ ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామన్న పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలు అవసరం లేదని 2022 డిశంబర్‌లో రద్దు చేసింది. ఎల్టీ, ఫార్మసిస్టులను వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి ఆదేశాలు లేకుండా రిడిప్లయిడ్‌గా ఉద్యోగాల్లో నియమించుకున్నారు. వీరికి ఉద్యోగ భద్రత కూడా లేదు. వైద్యుడు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ఏఎన్‌ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, డైవర్‌, సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసిన సుమారు 1350 మంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారు. 104ను ఎత్తేసే సమయంలో వీరందరినీ ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ టి హరీష్‌రావు కూడా హామీ ఇచ్చినప్పటికి ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైద్యశాఖలో కాంట్రాక్ట్‌ పద్దతిలో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నిషీయన్స్‌, ఫార్మసిస్టులను ప్రభుత్వం ఇటీవలే రెగ్యులరైజ్‌ చేసింది. కానీ 104 ఉద్యోగులను పట్టించుకోలేదు. వైద్య శాఖలోని పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వారికి నెలకు రు.30వేలు, కొత్తగా నియామకమైన ఎల్టీ, ఫార్మసిస్టులకు రు.27వేలు వేతనాలు ఇస్తున్నారు. గత పదిహేనేళ్ళుగా పనిచేస్తున్న వీరికి మాత్రం కేవలం రు.20వేలు కూడా ఇవ్వడం లేదు. ఈ అరకొర జీతాలను కూడా ఆరునెలలకొకసారి కొత్తగా వచ్చే ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్లు కటింగులు చేస్తూ, సమయానికి ఇవ్వడం లేదు.  కరోనాలో కూడా వీరు విలువైన సేవలందించారు. మరో ఉద్యోగం కోసం నియామకమయ్యే వయస్సును కూడా వీరు దాటిపోయారు. కాబట్టి వీరందరి సేవలను గుర్తించి రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు, భద్రత కల్పించి, వారి సేవలకు తగ్గ వేతనాలివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాని కోరింది.
Spread the love