రాష్ట్రంలో రూ.500కోట్ల పెట్టుబడులు

–  కోర్నింగ్‌, ఎస్‌జీడీ ఫార్మా సంస్థలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నట్టు కోర్నింగ్‌, ఎస్‌జీడీ ఫార్మా సంస్థలు ఆదివారం ప్రకటించాయి. రూ.500 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫార్మాస్యూటికల్‌ ప్యాకేజింగ్‌ సామాగ్రి ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టనున్నాయి. బయో ఏషియా -2023 సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావుతో సమావేశం అనంతరం విషయాన్ని ఫార్మా సంస్థలు ప్రకటించాయి. ప్రైమరీ ప్యాకేజింగ్‌ సరఫరా గొలుసును సురక్షితం చేయడం ద్వారా తెలంగాణలో ఫార్మా పరిశ్రమను బలోపేతం చేస్తామని ఎస్‌జీడీ ఫార్మా ఎండీ అక్షరు సింగ్‌ అన్నారు. సుమారు రూ.500కోట్లతో ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో దాదాపు 150 మందికి ఉద్యోగాలు, 300 కంటే ఎక్కువ మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించారు. 2024లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తామని, ఎస్‌ఈడీ ఫార్మా సహకారంతో తెలంగాణలో అడుగుపెడుతున్నందుకు సంతోషిస్తున్నామని కోర్నింగ్‌ సంస్థ ఎండీ సుధీర్‌ పిళ్లై పేర్కొన్నారు. ఫార్మా స్యూటికల్‌ ప్యాకేజింగ్‌ నాణ్యతను మెరుగుపరుస్తూనే కిష్టమైన ఔషధాల పంపిణీని వేగవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈఫార్చ్యూన్‌ 500 కంపెనీ అయిన కోర్నింగ్‌, ఎస్‌ఈడీ ఫార్మా ప్రపంచ స్థాయి ఫెసిలిటీని ఏర్పాటు చేయనుండటంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఫార్మాస్యూటికల్‌ సింగిల్‌ యూజ్‌ టెక్నాల జీలో సామర్థ్యాలను విస్తరించేందుకు తెలంగాణలో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెరికాకు చెందిన ఫాక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. తక్కువ ఖర్చుతో కస్టమ్‌ మెడికల్‌, ఎస్‌యూటీ ఫార్మాలో వినియోగదారులకు మద్దతిచ్చేం దుకు ప్రపంచ స్థాయి ఫెసిలిటీని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఫాక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏక్నాథ్‌ కులకర్ణి పేర్కొన్నారు.
వైద్య పరికరాల కంపెనీల ప్రతినిధులతో మంత్రి…
బయో ఏషియా-2023 సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వైద్య పరికరాల కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వైద్య పరికరాల తయారీలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలవడమే తమ లక్ష్యమని తెలిపారు. పరిశ్రమలకు అనుకూలంగా విధానాలున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా యుకెలో హెడ్‌ క్వార్టర్స్‌ కలిగిన రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ సేవిల్స్‌ హైదరాబాద్‌ ది స్ప్రింట్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఈ రిపోర్టు వ్యాపార హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలుపుతున్నదని అన్నారు.

Spread the love