లోకం గుట్టును విప్పి చెప్పిన పాట

అవినీతి చర్యలతో, కల్తీ వ్యాపారాలతో, దోపిడీ విధానాలతో ఈ లోకం అల్లకల్లోలమె ౖపోతుంది. ఎటు చూసినా అక్రమాలే. చేసే ప్రతి పనిలో కల్తీయే. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, స్వరాజ్యం లభించిందని మనం విర్రవీగుతాం కాని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యారంగాలలో ఎక్కడా న్యాయం జరగడం లేదు. అంతా దగాలే జరుగుతున్నాయి. వాటి గుట్టును విప్పి చెప్పే పాటను ‘దేశంలో దొంగలు పడ్డారు’ (1987) సినిమా కోసం కె.లక్ష్మీనారాయణ రాశాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు ఎక్కడ న్యాయం జరిగింది? పేదల్ని దోచుకోవడం, ధనవంతుల ఖజానాలు నింపడం – ఇదే తరతరాలుగా జరుగుతున్న అన్యాయమని ఈ పాటలో ఎలుగెత్తి ప్రశ్నించారు కె.లక్ష్మీనారాయణ.
చూడు మల్లేశా! చూడు. ఈ దేశం ఎటుపోతుందో ఒక్కసారి చూడు. ఈ దేశ భవిష్యత్తు ఎలా మారిపోతుందో ఒక్కసారి కన్నెత్తి చూడు అంటూ సినిమాలో ఓ పసివాడు ఆవేదనతో పాడుతుంటాడీపాటను. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పే ఈ ప్రభుత్వం, పసిపిల్లలు తినడానికి తిండి లేక వాళ్ళ కడుపులు వీపుకంటుకుపోయి, ఆకలి మంటలతో అలమటించి, చెత్త కుప్పల వద్ద ఎంగిలి విస్తర్లలోని తిండిని ఏరుకుని తింటుంటే కాస్తయినా జాలి చూపని ఈ ప్రభుత్వం, ఈ సమాజం – బాలల్ని రేపటి పౌరులుగా ఎలా గుర్తించగలదని అధిక్షేపించిన తీరు ఇందులో కనిపిస్తుంది.

పిల్లల చదువుల కోసం ఎన్ని పాఠశాలలు తిరిగినప్పటికీ లాభం లేకపోయింది. కారణం వాళ్ళు పేద విద్యార్థులు కావడమే. సీట్లు అన్నీ ధనవంతుల పిల్లలకు రికమెండేషన్ల ద్వారా అందుతాయి. కష్టపడి చదువుకోవాలనుకునే విద్యార్థులకు మాత్రం సీటు దొరకదు. ప్రశ్నించినా పై ఆఫీసర్‌ నుంచి బదులు దొరకదు. ఎంత బతిమిలాడినా, కాళ్ళ వేళ్ళ పడినా ఫలితమేమి ఉండదు. లంచాలకు, డబ్బులకు చదువు అమ్ముడుపోయే రోజులు దాపురించాయని, ఈ దేశ విద్యావ్యవస్థ అంతకంతకు దిగజారిపోతున్న సందర్భం కనబడుతుంది.

పేద విద్యార్థుల కోసమని వేరే బళ్ళు పెడతారు. ధనవంతుల పిల్లలతో కలిసి చదువుకోనివ్వరు. చదువుకునే దగ్గర ధనిక, బీద తేడాలు చూపించే దుస్థితి నేడు ఉంది. అలా పశువుల కొట్టాల మాదిరిగా పేదపిల్లలకు బడులు పెడితే – వర్షం పడితే వరద నీరంతా బడిలోకే వస్తుంది. ఎండకు ఎండుతూ, గాలికి వణుకుతూ, భయపడుతూ, చెట్ల కింద చదువుకుంటూ, రోడ్డు పక్కన బతుకు గడుపుతూ పేదపిల్లల జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి.

అంతే కాదు – వెనుకబడ్డ పిల్లల్ని ఉద్ధరిస్తామని చెప్పి, వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తామని చెప్పి, కొన్ని హాస్టళ్ళు పెట్టి, పుచ్చిపోయి పురుగులు పట్టిన ఆహారాన్ని పిల్లలకు పెట్టి వాళ్ళ తిండి కోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్మును అధికారులు మింగి పేదోళ్ళ కడుపులు కొడుతున్నారు.

ప్రతి సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయని చెబుతుంటారు. కాని తెలుగు పుస్తకం ఉంటే, హిందీ ఉండదు. హిందీ ఉంటే గణితం ఉండదు. కారణం పాఠ్య పుస్తకాలను కూడా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుని పుస్తకాల దుకాణం వాడు తన జేబు నింపేసుకుంటున్నాడు. ఇలాంటి దారుణ పరిస్థితులు మన దేశంలో ఇంకా నేటికీ కనబడుతున్నాయి.

జాతీయ జెండాకు ఎన్ని రంగులుంటాయో కూడా తెలియని అవివేకులు ఎందరో రాజకీయాల్లోకి చేరి ప్రజల బాగోగులు చూస్తామని వాగ్దానాలు చేస్తుంటారు. గద్దెలెక్కి పరిపాలకులుగా చలామణీ అవుతుంటారు. ఉదయం ఒక రాజకీయ పార్టీ పుడుతుంది. సాయంత్రం మరో రాజకీయ పార్టీ పుడుతుంది. ఇలా రాజకీయ పార్టీల మీద పార్టీలు పెట్టి, న్యాయం మాట మరిచిపోయి దేశాన్ని భ్రష్టు పట్టి స్తున్నారు. ఎవడు ఏ పార్టీకి చెందినవాడో గుర్తించరాని రోజులు వచ్చాయి.

అవినీతి మరకలతో పెడదారి పట్టిపోతున్న ప్రస్తుత దేశ పరిస్థితులను గూర్చి కళ్ళకు కట్టినట్లు చిత్రించాడీ పాటలో లక్ష్మీనారాయణ.
పాట:-
చూడు మల్లేశా చూడు మల్లేశా
దేశమెటు పోతుందో కనరా మల్లేశా
ఈనాటి బాలలంత రేపటిపౌరులంట
నరాలన్ని తేలిపోయి నత్తబడ్డ కడుపుతోటి
ఎంగిలి ఇస్తర్ల కొరకు ఎగాబడ్డ తీరు జూడు
పిల్లగాండ్ల సదువు కొరకు ఎన్ని బళ్ళు తిరిగినా
సీటు మాట సెప్పరాయె సాటు మాటు పిలుపులాయె
కాళ్ళ వేళ్ళ బడ్డా గాని కనికరించబాయే సారు
లంచమిస్తె గాని నీకు సీటు లేదు పొమ్మనిరో
దొడ్డ కొట్ల లోలె బడులు ఊరూరు పెట్టినారు
వానపడితె వరదనీరు బడిలోకి వచ్చినాయి
ఎండదెబ్బ గాలిదెబ్బ ఏకంగ కొట్టబట్టె
చెట్ల కింద చదువులాయె రోడ్ల మీద బతుకులాయె
వెనుకబడ్డ వాళ్ళ పిల్లనుద్దరిస్తామాని చెప్పి
కంటి తుడుపులాగ కొన్ని హాస్టళ్ళు పెట్టినారు
పుచ్చిపోయిన బియ్యాన్ని పిల్లలకు వండిపెట్టి
హాస్టళ్ళో సొమ్మునంత అధికారులు మింగినారు
ఏడాదికొకసారి పుస్తకాలు ముద్రకొట్టి
అందరికీ పుస్తకాలు అందుబాటుంటయనిరి
తెలుగు ఉంటే హింది లేదు హింది ఉంటే లెక్కల్లేవు
బ్లాక్‌ చేసి రెట్లు పెంచి షావుకార్లు బలిశిరాయె
జాతీయజెండకున్న రంగులెన్నొ తెలియనోళ్ళు
ప్రజల దోచి గద్దెలెక్కె రాజకీయ దేశగాళ్ళు
పొద్దు పొడిస్తె ఓ పార్టీ పొద్దుగూకితె ఓ పార్టీ
ఎవ్వడు ఏ పార్టోడో ఎరగరాని రోజులొచ్చె
చూడు మల్లేశా చూడు మల్లేశా దేశమెటుపోతుందో కనరా మల్లేశా
చూడు మల్లేశా చూడు మల్లేశా దేశమెట్ల కాల్తందో కనరా మల్లేశా.
– తిరునగరి శరత్‌ చంద్ర

Spread the love