విఫల నాయకుడు!

–  నా కెప్టెన్సీని అలాగే చూశారు
–  విరాట్‌ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించటం గొప్ప గౌరవంతో పాటు అంతకుమించిన కఠిన పరీక్ష. ఈ సవాల్‌ను కొందరు అలవోకగా స్వీకరిస్తే, కొందరు కష్టసాధ్యంగా చూశారు. నాయకత్వంలో విజయవంతమైనా.. విఫల నాయకుడిగా మిగిలిన సారథుల్లో విరాట్‌ కోహ్లి ముందుంటారు!. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని రికార్డుకు తోడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్‌ వరకు చేరినా.. విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా విఫలమైనట్టే పరిగణించారు. ఐపీఎల్‌ ప్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ పాడ్‌కాస్ట్‌లో విరాట్‌ కోహ్లి ఇదే విషయాన్ని వెల్లడించారు. జాతీయ జట్టుకు సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించినా కెరీర్‌లో ఓ ఐసీసీ టైటిల్‌ అందుకోని క్రికెటర్లు ఉన్నారు. కానీ నేను ఆటగాడిగా ఐసీసీ ప్రపంచకప్‌, ఐసీసీ చాంపియన్‌షిప్‌ ట్రోఫీ, ఐసీసీ టెస్టు గదలను సొంతం చేసుకున్నాను. అయినా, నన్ను వైఫల్య నాయకుడిగానే చూశారని కోహ్లి అన్నారు. ‘ ఏ టోర్నీలోనైనా విజయం కోసమే ఆడతాం. చాంపియన్స్‌ ట్రోఫీ 2017 ఫైనల్లో, 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021 ఫైనల్లో భారత జట్టుకు సారథ్యం వహించాను. ఓ నాలుగు ఐసీసీ టోర్నీల అనంతరం నన్ను విఫల నాయకుడిగా పరిగణించారు. అయితే, నన్ను నేను ఆ కోణంలో ఎప్పుడూ బేరీజు వేసుకోను. నా కెప్టెన్సీ సమయంలోనే భారత జట్టులో ఓ కల్చరల్‌ మార్పు వచ్చింది. దీని పట్ల నేను గర్వపడతాను. ఓ ఐసీసీ టోర్నీ కొన్ని రోజుల్లోనే జరుగుతుంది. కానీ అదే ఓ జట్టులో కల్చరల్‌ మార్పుకు ఎంతో సమయం పడుతుంది. అందుకు ఎంతో నిలకడ అవసరం. నా నాయకత్వంలో భారత జట్టు అది సాధించింది. అందుకు నేను గర్వపడతాను. ఆటగాడిగా నేను ఐసీసీ ప్రపంచకప్‌ విజయం సాధించాను. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ అందుకున్నాను. ఐదు టెస్టు గదలు గెల్చుకున్న జట్టులో భాగంగా ఉన్నాను. ఇక్కడ మరో కోణంలో చూస్తే.. కెరీర్‌ అసాంతం ఐసీసీ టైటిల్‌ అందుకోని ఆటగాళ్లు ఉన్నారు’ అని విరాట్‌ కోహ్లి అన్నాడు. భారత క్రికెట్‌లో ఎం.ఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి దిగ్గజాలు. 15 ఏండ్ల కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లో సుమారు 11 ఏండ్లు ఎం.ఎస్‌ ధోనితో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకున్నాడు. మహి సారథ్యంలోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన విరాట్‌.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలు సైతం ధోని నుంచే అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన కోహ్లి 2019 నుంచి కాస్త నెమ్మదించాడు. కెరీర్‌లో ఎన్నడూ ఎదుర్కొని పరిస్థితిని చవిచూశాడు. ఆ సమయంలో భార్య అనుష్క, కుటుంబ సభ్యులు, చిన్ననాటి కోచ్‌ మినహా బయటి నుంచి మనోధైర్యం అందించిన వ్యక్తి ఎం.ఎస్‌ ధోని అని కోహ్లి అన్నాడు. ఆ సమయంలో ధోని స్వయంగా ఫోన్‌ చేసి నైతికంగా మద్దతు ఇవ్వటంతో పాటు ఆత్మవిశ్వాసం కలిగించాడన్నాడు. అయితే, నిజానికి ఎం.ఎస్‌ ధోనికి ఏ సమయంలో ఫోన్‌ చేసినా 99 శాతం అట్నుంచి సమాధానం ఉండదు. ఎందుకంటే, ధోని అసలు ఫోన్‌ చూడడు అని కోహ్లి చెప్పుకొచ్చాడు. అన్ని స్థాయిలు, అన్ని ఫార్మాట్లలో నాయకత్వం త్యజించిన అనంతరం సరికొత్తగా అనిపిస్తోందని విరాట్‌ కోహ్లి తెలిపాడు.

Spread the love