వ్య.కా.స. జాతీయ మహాసభలు జయప్రదం చేయండి

–  హౌరాలో ఈనెల 15 నుంచి 18 వరకు…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పట్టణంలో ఈనెల 15 నుంచి 18 వరకు జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభల్ని జయప్రదం చేయాలని పలు ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం చిక్కడపల్లిలోని తెలంగాణ వ్య.కా.సం. రాష్ట్ర కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత కిసాన్‌ సభ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, టీ సాగర్‌ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్‌ రాములు, నాయకులు బి ప్రసాద్‌, బి పద్మ, ఆర్‌ ఆంజనేయులు, శోభన్‌నాయక్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోటా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి రాజ్యాంగబద్ధంగా సాధించుకున్న చట్టాలు, హక్కులను అమలు చేయకుండా నీరు కారుస్తున్నదని చెప్పారు.. కుటుంబానికి వంద రోజుల పనిని గ్యారెంటీ చేస్తూ యూపీఏ కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా తొక్కి పట్టి, బడ్జెట్‌ కేటాయింపుల్లో భారీగా కోత విధించారని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌ కార్చాచరణ రూపకల్పన మహాసభల్లో జరుగుతుందనీ, దాన్ని విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.

Spread the love