శత్రుదేశం మీద పగబట్టినట్టు… తెలంగాణపై బీజేపీ పగబట్టింది

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో హైదరాబాద్‌ కన్నా ఆరు చిన్న పట్టణాలకు 20 శాతం కేంద్రం వాటా, సావరీన్‌ గ్యారంటీ ఇస్తూ మెట్రోకు కేంద్రం అనుమతులిచ్చింది. గుజరాత్‌లోని అలహాబాద్‌, గాంధీనగర్‌తో పాటు చెన్నై మెట్రోలకు కూడా ఓకే చెప్పిందన్నారు. కానీ రూ, 8,455 కోట్లతో హైదరాబాద్‌లోని బీహెచ్‌ఇఎల్‌ నుంచి లక్డికాపూల్‌, ఎల్‌.బీ.నగర్‌ నుంచి నాగోల్‌ వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రతిపాదనలను సమర్పించేందుకు కూడా కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ కలిసేందుకు ప్రయత్నించినా పడనివ్వలేదని తెలిపారు. పైపెచ్చు వయబిలిటీ ఉందా? ప్రయాణికులున్నారా? అంటూ కొర్రీలను పెట్టారని విమర్శించారు.. హైదరాబాద్‌ కన్నా చిన్న పట్టణాల్లో ప్రయాణికులుంటే హైదరాబాద్‌లో ఉండరా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ మెట్రోను గమనిస్తే ప్రయాణికుల రద్దీ ఎలా ఉందో అర్థమవుతుందని హితవు పలికారు. కేంద్ర మంత్రి కలవకపోవడంతో రాష్ట్ర కార్యదర్శి ద్వారా కేంద్ర కార్యదర్శికి ప్రతిపాదనలు, డీపీఆర్‌ సమర్పించారని తెలిపారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో రైల్‌ ప్రాజెక్టు పొడిగింపుపై బీఆర్‌ఎస్‌ సభ్యులు గూడెం మహిపాల్‌ రెడ్డి, తోల్కంటి ప్రకాష్‌ గౌడ్‌, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎంఐఎం సభ్యులు జాఫర్‌ హుస్సేన్‌, కౌసర్‌ మోజంఖాన్‌లు మెట్రో విస్తరణకు పలు సూచనలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మెట్రో రైల్‌ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం మెట్రో ఛార్జీలు పెంచారనీ, ప్రకటనల హౌర్డింగ్‌లను ఏకపక్షంగా కట్టబెడుతున్నారని విమర్శించారు. ఇందుకు మంత్రి కేటీఆర్‌ బదులిస్తూ, 55 ఏండ్లు పాలించిన పార్టీగా కాంగ్రెస్‌ ఆ మాత్రం చేయకపోతే ఎలా? అని ఎదురు ప్రశ్నించారు. మెట్రో రైల్‌ తెచ్చామనీ చెప్పుకుంటే సరిపోదనీ, చేసుకున్న ఒప్పందాలేంటో తెలుసుకోవాలని సూచించారు. ఆ ఒప్పందాల మేరకే ఛార్జీలు, ప్రకటనలు ఉంటున్నాయని తెలిపారు. మెట్రో రెండో దశలో మియాపూర్‌ నుంచి బీహెచ్‌ఇఎల్‌కు విస్తరిస్తామని తెలిపారు. పాతనగరంలో రోడ్ల వెడల్పు కోసం రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు.  వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం కింద చేపట్టిన 56 పనులు వివిధ దశల్లో ఉన్నాయని బీఆర్‌ఎస్‌ సభ్యులు దానం నాగేందర్‌ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే కార్వాన్‌ కాంట్రాక్టర్‌ను మారుస్తామని తెలిపారు. చార్మినార్‌ పాదాచారుల బాట ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేస్తామనీ, దీన్ని స్వయంగా తానే పర్యవేక్షిస్తానని ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్‌ ఓవైసి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి చెప్పారు. హుస్సేన్‌ సాగర్‌ వద్ద నీరా కేఫ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. రాష్ట్రంలో సొంతంగా 20 కోట్ల చేప పిల్లలు ఉత్పత్తి చేస్తున్నామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. వాటి ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఈ రంగంలోకి ప్రయివేటు వ్యక్తులు వస్తే ప్రోత్సహిస్తామని చెప్పారు.
సిగ్గు, లజ్జ లేకుండా బీజేపీ ధర్నాలు
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ఇవ్వాల్సిన రూ.2,000 కోట్లు ఇవ్వదు. ఈ విషయంలో ఎన్నిసార్లు అడిగినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులేమో సిగ్గు, లజ్జ లేకుండా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు తక్కువ చేశారంటూ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తారు. బీజేపీకి సిగ్గు వచ్చేలా బీజేపీ కార్యాలయం ముందు తామే ధర్నా చేస్తాం …..’ అని బీఆర్‌ఎస్‌ సభ్యులు దానం నాగేందర్‌ హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీకి కేటాయించిన నిధుల్లో హైదరాబాద్‌కు సంబంధించి రూ.20 కోట్లు మాత్రమే ఉన్నాయనీ, దాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

 

Spread the love