– పీర్జాదీగూడలో ఇండ్లు కేటాయించాలని కోరుతూ గుడిసెలు వేసుకున్న ప్రజలు
– బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన స్థలంలో గుడిసెలు వేయడంపై అధికారుల్లో ఆందోళన
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ జిల్లా పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబరు 103 లో గల సర్కారు భూమిలో స్థానిక పేద ప్రజలు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ గుడిసెలు వేసుకు న్నారు. పేదలు ఆందోళన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తుంగతుర్తి రవి అక్కడికి చేరుకుని అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించడంలో సర్కారు విఫలం అయ్యిందని అందుకే సర్కారు భూముల్లో గుడి సెలు వేసుకున్నా రని అన్నారు. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.పేదలకు న్యాయం జరిగే వరకు వారి ఆందోళనకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ స్టేట్ కో-ఆర్డినేటర్ పవన్ గౌడ్, యువజన కాంగ్రెస్ కార్యదర్శి మోహన్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దష్టికి తీసుకువేళ్తా..
పేద ప్రజలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న సంగతి తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ పాశం శశిరేఖ బుచ్చి యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అర్హులైన పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విధంగానే ఇక్కడ కూడా అర్హులకు న్యాయం జరిగేలా ఈ విషయాన్ని స్థానిక మంత్రి మల్లారెడ్డి దష్టికి తీసుకువెళ్తానని హమీ ఇచ్చారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా ఉండేందుకు గాను మేడిపల్లి సీఐ గోవర్ధన గిరి ఆధ్వర్యంలో భారీ బందొబస్తు ఏర్పాటు చేశారు.
రజక ఆత్మగౌరవ భవనానికి కేటాయించిన భూమికే ఎసరా?
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అన్ని కులాల వారికి రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించే కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 103లో రజక ఆత్మగౌరవ భవనానికి మూడు ఎకరాల స్థలం కేటాయింపు చేసింది. కేటాయింపు ఎలా ఉన్నా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రారంభోత్సవం చేపట్టకపోవడంతో ఖాళీ స్థలం ఉండడంతో ఈ స్థలంపై కొంత మంది కన్ను పడడంతో అక్కడ పేదల పేరిటా గుడిసెలు వేసే కార్యక్రమాన్ని కావాలనే చేపట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడి స్థానిక నాయకులకు రజక ఆత్మగౌరవ భవనానికి స్థలం కేటాయించడం మొదటి నుంచి ఇష్టం లేని వారే పేదలు గుడిసెలు వేసేలా ప్రోత్సహించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.తమ ఆత్మగౌరవ భవనానికి కేటాయించిన స్థలంలో వేరే వాళ్లు వచ్చి గుడిసెలు వేసుకున్నారనే సమాచారం అందుకున్న రజక సంఘాల నేతలు పి.కుమార స్వామి, కె.సంపత్, ఏ.నగేష్, కల్కూరి ఎల్లయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక తహసీల్దారుకు, మేడిపల్లి సీఐకి సమాచారం అందించడంతో పాటు బీడీ ఫెడరేషన్ జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన అధికారులు రజక ఆత్మగౌరవ భవనానికి కేటాయించిన స్థలం ఎటు పోదని స్పష్టం చేశారు.