‘సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తత అవసరం’

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో సైబర్‌ నేరాలను అరికటడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదనీ, ముఖ్యంగా వీటి బారిన పిల్లలు పడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో రాష్ట్ర మహిళా భద్రతా విభాగం, రాష్ట్ర విద్యా శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సైబర్‌ నేరాల నిరోధక కార్యక్రమంలో సైబర్‌ అంబాసిడర్‌ ఫ్లాట్‌ఫామ్‌ను హౌంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని విధాలా పురోగతి సాధించడానికి శాంతి భద్రతలు సవ్యంగా ఉండటమే కారణమని అన్నారు. అయితే ఆధునిక సాంకేతిక విజ్ఞానం కారణంగా మరో వైపు సైబర్‌ నేరాలు కూడా పెరిగి పోతున్నాయనీ, వాటి వలన వచ్చే నష్టాల గురించి అవగాహన లేక పోవడం వలన అనేక మంది సైబర్‌ నేరస్తుల బారిన పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థులు ఈ నేరాల బారిన పడకుండా వారిలో అవగాహనను పెంచడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాల గురించి అన్ని వర్గాలలో అవగాహనను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా వారిలో అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలను రాష్ట్ర మహిళా భద్రతా విభాగం తీసుకుంటున్నదని తెలిపారు. దేశం డిజిటల్‌ విజ్ఞానంలో ముందుకు సాగుతున్న వేళ సైబర్‌ నేరస్థులు సైతం దానిని ఆసరాగా చేసుకుని టెక్నాలజీని వినియోగించుకుని నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సమయంలో సైబర్‌ అంబాసిడర్‌లను ఎ ంపిక కేసి వారికి తగిన శిక్షణన ఇవ్వడం వలన ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయగలమని తెలిపారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ శిఖాగోయల్‌ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలపై ప్రజలలో వివిధ వర్గాలలో చైతన్యాన్ని పెంచడానికి సైబర్‌ అంబాసిడర్లు కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా డిజిటల్‌ యుగంలో వస్తున్న మార్పులపై జనంలో అవగాహనను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యాశాఖతో కలిసి తాము సంయుక్తంగా సైబర్‌ నేరాలపై విద్యార్థులలో అవగాహనను పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 9424 మంది సైబర్‌ అంబాసిడర్లను 2381 స్కూళ్ల నుంచి ఎంపిక చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love