హౌదాను బట్టి జీతాలిస్తారా?

– టీఎస్‌ఆర్టీసీజేఏసీ ఆక్షేపణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో హౌదాలను బట్టి జీతాలు ఇవ్వడం ఏంటని టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ కే రాజిరెడ్డి, కన్వీనర్‌ వీఎస్‌ రావు ఆక్షేపించారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రతినెలా 1వతేదీ జీతాలిస్తామంటూ కార్మికులు, సంస్థ బ్యాంకు ఖాతాలను ఎస్‌బీఐ నుంచి యూనియన్‌ బ్యాంకుకు మార్చారని చెప్పారు. ఈనెల 4వ తేదీ వచ్చినా గ్యారేజీ కార్మికులు, సూపర్‌వైజర్లు, ఆఫీస్‌ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి జీతాలివ్వలేదని తెలిపారు. రోజూ ఆర్టీసీకి లాభాలొస్తున్నాయని యాజమాన్యం మీడియాలో ప్రచారం చేసుకుంటున్నదనీ, సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కార్మికులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారనీ, వారి ఈఎమ్‌ఐలు బౌన్స్‌ అయితే ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారంనాటికి జీతాలు ఇవ్వకుంటే ఈనెల 7వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Spread the love