టీఎస్ఆర్టీసీ కొత్త బస్ పాస్..

నవతెలంగాణ-హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.  ఈ టౌన్‌ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది.  హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో జులై 17వ తేదీ  సోమవారం “పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌” పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు.  ఈ కొత్త టౌన్ పాస్ జులై 18 మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని సజ్జనార్ తెలిపారు. ఈ బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Spread the love