– మరోచోట రూ.60లక్షల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ-హయత్ నగర్
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాచకొండ కమిషనరేట్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్‌బీ నగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహన్ వెల్లడించారు. కర్ణాటకకు చెందిన మోహన్ రాథోడ్ గతంలో గంజాయి కేేసులో నిందితుడు. అయితే నాచారానికి చెందిన పెద్ద బాబురావు, సికింద్రాబాద్‌కు చెందిన మద్దెల రమేష్, కర్ణాటకకు చెందిన బహుళ్య లీలావతి అలియాస్ గంగరాజు, సంతోష్‌తో కలిసి మోహన్ విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నాడు. హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు, ఆ తర్వాత కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు చేరవేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ, కీసర పోలీసులు కలిసి ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. వారి నుంచి 430 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ కోటి 11లక్షల రూపాయలు ఉంటుందని సీపీ చెప్పారు. ఇద్దరు నిందితుల నుంచి 430కేజీల గంజాయి, కారు, ఇనుప రాడ్లు, రూ.2170, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు సీపీ చెప్పారు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, మల్కాజిగిరి ఎస్‌ఓటీ డీసీపీ గిరిధర్, కీసర ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రాములు, వాసుదేవ్, పరమేశ్వర్ తదితరులు ఉన్నారు.
మరోచోట 200 కేజీల గంజాయి పట్టివేత
మరో చోట ఒడిశా ఒరిస్సా నుంచి ఢిల్లీకి 200 కేజీల గంజాయి తరలిస్తుండగా హయత్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన ప్రధాన సూత్రధారి అయిన నూకరాజు, ఇదే రాష్ట్రానికి చెందిన గంట శ్రీనుబాబు, ఈస్ట్ గోదావరికి చెందిన అక్కబాతుల లక్ష్మణ కుమార్‌తో కలిసి గంజాయిని వ్యర్థ రసాయన డీసీఎం(కెమికల్ ట్యాంక్)లో పూణే, మహారాష్ట్ర, రంపచోడవరానికి తరలించారు. గురువారం ఒడిశా నుంచి ఖమ్మం, సూర్యాపేట మీదుగా ఢిల్లీకి తరలిస్తుండగా హయత్‌నగర్ వద్ద పట్టుబడ్డారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా డీసీఎం ట్యాంకర్‌లో 200కేజీల గంజాయి లభ్యమైంది. దాని విలువరూ. 60 లక్షల 10వేలు ఉంటుందని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఎల్‌బీనగర్ జోన్ డీసీపీ సాయిశ్రీ, ఎల్‌బీ నగర్ జోన్ ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్, వనస్థలిపురం ఏసీపీ భీమ్ రెడ్డి ఉన్నారు.