బడిబయట పిల్లలు 16,683 మంది

బడిబయట పిల్లలు 16,683 మంది– ప్రాథమిక స్థాయిలో 11,405, మాధ్యమిక స్థాయిలో 5,278
– జోగులాంబ గద్వాలలో అత్యధికంగా 1,221 మంది
– హన్మకొండలో అత్యల్పంగా 120 మంది
– విద్యాశాఖ సర్వేలో గుర్తింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బడిబయట పిల్లలు 16,683 మంది ఉన్నారు. వారిలో ప్రాథమిక (ఎలిమెంటరీ) స్థాయిలో 11,405 మంది, మాధ్యమిక (సెకండరీ) స్థాయిలో 5,278 మంది పిల్లలున్నారు. పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 1,221 మంది ఉన్నారు. వారిలో ప్రాథమిక స్థాయిలో 956 మంది, మాధ్యమిక స్థాయిలో 265 మంది ఉన్నట్టు గుర్తించారు. హన్మకొండ జిల్లాలో అత్యల్పంగా 120 మంది ఉన్నారు. వారిలో ప్రాథమిక స్థాయిలో 95 మంది, మాధ్యమిక స్థాయిలో 25 మందిని గుర్తించారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రాథమిక స్థాయిలో 659 మంది, మాధ్యమిక స్థాయిలో 303 మంది కలిపి 962 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రాథమిక స్థాయిలో 591 మంది, మాధ్యమిక స్థాయిలో 348 మంది కలిపి 939 మంది, సిద్ధిపేట జిల్లాలో ప్రాథమిక స్థాయిలో 458 మంది, మాధ్యమిక స్థాయిలో 398 మంది కలిపి 856 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ జిల్లాలో ప్రాథమిక స్థాయిలో 553 మంది, మాధ్యమిక స్థాయిలో 21 మంది కలిపి 574 మంది పిల్లలున్నారు.
వారి వయస్సు తగ్గ తరగతిలో ప్రవేశం
బడి బయట ఉన్న పిల్లలు మధ్యలో చదువును మానేయడం, పాఠశాలలకే వెళ్లని వారు ఉండొచ్చు. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2010, ఏప్రిల్‌ ఒకటో తేదీన అమల్లోకి వచ్చింది. 6-14 ఏండ్ల వయస్సు గల పిల్లలను బడిలో తప్పనిసరిగా చేర్పించాలని చట్టం చెబుతోంది. బడి బయట ఉన్న బడిఈడు పిల్లలను విద్యాశాఖ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,683 మంది ఉన్నారు. బడిబయట ఉన్న పిల్లలను వారి వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం కల్పించాలి. ఆ తరగతిలో కూర్చోవడానికి ముందు వారికి తగిన అభ్యసనా స్థాయిని పెంచాల్సిన అవసరముంది. ఆ పిల్లలకు ప్రత్యేక బోధన కార్యక్రమం చేపట్టాలని విద్యాహక్కు చట్టంలో నిబంధనలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ చిత్తశుద్ధితో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించడమే కాకుండా వారిని బడుల్లో చేర్పించి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరమున్నది.

బడిబయట పిల్లలు 16,683 మంది

Spread the love