18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు

– మల్టీజోన్‌-1లో 11,177 మంది, మల్టీజోన్‌-2లో 7,765 మందికి ప్రమోషన్లు
– భాషాపండితులు, పీఈటీల కల సాకారం
– ముగిసిన ప్ర్రక్రియ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ గురువారంతో ముగిసింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. దీంతో పదోన్నతులు పొందిన వారంతా ఆనందోత్సాహంలో ఉన్నారు. 20 ఏండ్లుగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు (పీఈటీ) ఎదురుచూస్తున్న పదోన్నతుల కల ఇప్పుడు సాకారమైంది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. ప్రజాప్రభుత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయులకు అందలం చేశామని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సముచిత రీతిలో వ్యవహరించిందని పేర్కొంది. పదోన్నతులకు అడ్డంకిగా మారిన చట్టపరమైన వివాదాలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో అర్హులైన వేలాది మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లకు నోచుకోలేదని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, విద్యాశాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఈ అంశంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపర్చారని పేర్కొంది. సీఎం చొరవతో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఫలితంగా 18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మల్టీజోన్‌-1లో 11,177 మంది, మల్టీజోన్‌-2లో 7,765 మంది ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి.
వివాదరహితంగా పదోన్నతుల నిర్వహణ
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. అయినా ఎక్కడా వివాదాలకు తావు ఇవ్వలేదు. మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి పారదర్శకతతో చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. తమ అర్హతకు తగినట్టు పదోన్నతులు దక్కడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, అదనపు సంచాలకులు కె లింగయ్య, ఇతర అధికారులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. తమ కష్టాన్ని, శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతోపాటు సముచిత రీతిలో గౌరవించడంతో ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో విద్యా బోధన చేపట్టే అవకాశమున్నది. ఫలితంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యా నాణ్యత స్థాయి మరింత పెరగనుంది.
భాషాపండితుల హర్షం
20 ఏండ్ల కలను సాకారం చేసి పదోన్నతులు కల్పించటం పట్ల ఆర్‌యూపీపీటీఎస్‌ హర్షం ప్రకటించింది. పదోన్నలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, విద్యాశాఖ అధికారులకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి జగదీశ్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌ నర్సిములు, కోశాధికారి కట్టా గిరిజారమణశర్మ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనలో మరింత శ్రద్ధతో ముందుకుసాగుతామని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలో భాషలను బలోపేతం చేయాల్సిన అవసరముందనీ, ఎల్పీ వ్యవస్థను ప్రవేశపెట్టి అక్కడ తెలుగు, హిందీ పండిత పోస్టులను సృష్టించి నియమించాలని కోరారు. భాషలను భాషా పండితులతో బోధించజేయాలని సూచించారు. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల్లో ఎస్‌ఏ హిందీ పండితులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్రంలోని ఓరియెంటల్‌ కళాశాలను పునరుద్ధరించి నియామకాలను చేపట్టి భాషలకు గౌరవాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగుకు వారానికి తొమ్మిది పీరియెడ్లు, హిందీకి ఆరు పీరియెడ్లు కేటాయించాలని కోరారు.

Spread the love