29వేలు దాటిన పాలస్తీనా మృతులు

– పెరుగుతున్న ఆకలి కేకలు
– అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం రఫా :యునిసెఫ్‌
– ఇజ్రాయిల్‌ ఆక్రమణలకు ముగింపు పలకాలి
–  అంతర్జాతీయ న్యాయ స్థానంలో పాలస్తీనా డిమాండ్‌
ది హేగ్‌ : పాలస్తీనా భూభాగాల ఆక్రమణకు తక్షణమే స్వస్తి చెప్పాలంటూ పాలస్తీనా ప్రతినిధులు కోరారు. ఇజ్రాయిల్‌ అమలు చేస్తున్న వర్ణ వివక్ష వ్యవస్థకు ముగింపు పలకాన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో సోమవారం ప్రారంభమైన విచారణల సందర్భంగా పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్‌ అల్‌ మలికి, ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా దూత రియాద్‌ మన్సూర్‌లతో పాటూ పలువురు విద్యా, న్యాయ నిపుణులు పాల్గొన్నారు. ఈ విచారణలు 26 వరకు సాగుతాయి. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా వేసిన ఊచకోత కేసుతో సంబంధం లేకుండా జరుగుతున్న కేసు విచారణ ఇది. దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణకు న్యాయ, చట్టపరమైన పర్యవసానాలను నిర్ణయించేందుకు ఈ విచారణ చేపట్టారు. కాగా ఈ విచారణతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారవచ్చని పాలస్తీనియన్లు ఆశాభావంతో వున్నారు.
24గంటల్లో 107మంది మృతి
గత 24గంటల్లో 107మంది పాలస్తీనియన్లు మరణించారు. దీంతో గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణ హోమంలో మృతుల సంఖ్య 29,092కి చేరుకుంది. 69,028మంది గాయపడ్డారు. మరోవైపు ఆపకుండా సాగుతున్న దాడులతో గాజాలో ఆకలి కేకలు ఉధృతమవుతున్నాయి. ఇజ్రాయిల్‌ బలగాలు తమపై కాల్పులు ప్రారంభించిన నేపథ్యంలో పారిపోవడానికి ముందు కూడా వందలాదిమంది పాలస్తీనియన్లు సహాయక ట్రక్కుల వైపునకు పరుగులు పెట్టకుంటూ వస్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఖాన్‌ యూనిస్‌లోని నాసర్‌ ఆస్పత్రిలో 8మంది మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
గాజాలో పాలస్తీనా మహిళలు, పిల్లలను నిర్బంధించడం, ఉరి తీయడం, లైంగిక దాడులు జరపడం వంటి అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వాటికి విశ్వసనీయమైన సమాచారం కూడా వుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఇజ్రాయిల్‌ బలగాలతో దిగ్బంధించబడిన రఫా నగరం ప్రస్తుతం ఈ భూమండంపై గల అత్యంత జన సాంద్రత గల ప్రాంతాల్లో ఒకటిగా వుందని యునిసెఫ్‌ ప్రకటించింది.

Spread the love