మధ్యప్రదేశ్‌లో 35 మంది బీజేపీ నేతలపై వేటు

– బుజ్జగింపు ప్రయత్నాలు విఫలం తరువాతే బహిష్కరణ
న్యూఢిల్లీ బ్యూరో : మధ్యప్రదేశ్‌లో 35 మంది బీజేపీ నేతలపై వేటు పడింది. బుజ్జగింపు ప్రయత్నాలు విఫలం తరువాతే బహిష్కరణ జరిగింది. తిరుగుబాటుదారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ, పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న 35 మంది నేతలను బీజేపీ సస్పెండ్‌ చేసింది. సస్పెండ్‌ చేయబడిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది చంబల్‌, బుందేల్‌ఖండ్‌, మాల్వా-నిమార్‌ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. వేటు పడిన జాబితాలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మొరెనా నుంచి మాజీ మంత్రి రుస్తోమ్‌ సింగ్‌, తికమ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కేకే శ్రీవాస్తవ్‌, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నందకుమార్‌ చౌహాన్‌ కుమారుడు హర్షన్‌ వర్ధన్‌ చౌహాన్‌, సిద్ధి నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేదార్‌నాథ్‌ శుక్లా తదితరులను పార్టీ సస్పెండ్‌ చేసింది. తిరుగుబాటు నేతలను శాంతింపజేసేందుకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు. చాలా వరకు విఫలమయ్యారు. మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా కూడా తిరుగుబాటుదారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

Spread the love