నవతెలంగాణ-గంగాధర
శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయెాజనం చేకూరే డ్రోన్ల వినియెాగంపై రైతులకు అవగాహన కల్పంచే కార్యక్రమానికి వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. గంగాధర మండలం గోపాల్ రావుపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గ్రామ రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాల్లోని పంట చేన్లకు మందులను స్ప్రే చేసే విధానాన్ని డ్రోన్లను వినియెాగిస్తూ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్, శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మండల అధికారి రాజు మాట్లాడుతూ డ్రోన్ల వినియెాగం వల్ల ప్రతి కర్రకు మందు స్ర్పే అవుతుందని, తద్వారా తెగులు నివారణ త్వరితగతిన జరుగుతుందనే అంశాన్ని రైతులకు వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఎప్పటికప్పుడు మారుతూ అధునాతన పద్ధతులు అవలంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. చేతి పంపుల వినియెాగం వల్ల ఆశించిన లాభాలు చేకూరడంలేదని, సమయం, శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుందనే విషయాన్ని రైతులు గ్రహించాలని అన్నారు. వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు, అధునాతన పరికరాలు, పద్ధతులు వచ్చాయని, ప్రతీ రైతు సద్వినియెాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ రాసూరి మల్లేశం, వ్యవసాయ విస్తరణ అధికారులు వంశీ, ఆత్మ, రైతులు, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు పాల్గొన్నారు.

Spread the love