సభా కమిటీలకు 37 బడ్జెటేతర బిల్లులు

– మందగించిన సంప్రదింపుల ప్రక్రియ
న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 37 బడ్జెటేతర బిల్లులను పరిశీలన నిమిత్తం సభా కమిటీలకు పంపారు. వీటిలో పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజైన ఆగస్ట్‌ 18న స్టాండింగ్‌ కమిటీకి రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ నివేదించిన మూడు బిల్లులు కూడా ఉన్నాయి. 17వ లోక్‌సభలో ఇప్పటి వరకూ 210 బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే వీటిలో 17.6%..అంటే 37 బిల్లులను మాత్రమే సమీక్ష కోసం పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. అంటే దీనర్థం సంప్రదింపుల ప్రక్రియ మందగించిందన్న మాట. 16వ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో 25% బిల్లుల్ని పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. అదే 15వ లోక్‌సభలో 71%, 14వ లోక్‌సభలో 60% బిల్లులు పార్లమెంటరీ కమిటీల ముందుకు వెళ్లాయి. ప్రస్తుత పార్లమెంటులో కమిటీల ముందుకు వెళ్లిన 37 బిల్లుల్లో ఆరు బిల్లులు ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖకు చెందినవి కాగా ఐదు హోం శాఖకు చెందినవి. గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో లోక్‌సభలో 35 అప్రాప్రియేషన్‌-ద్రవ్య బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిని సంబంధిత స్టాండింగ్‌ కమిటీలు ఏటా సమీక్షిస్తున్నాయి.

Spread the love