41ఏ నోటీసులు తీసుకోకపోతే వెంటనే అరెస్ట్ చేస్తారా? : హైకోర్టు

నవతెలంగాణ హైదరాబాద్: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టు పరిణామాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 41ఏ నోటీసులపై ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు వివరణ కోరింది. కౌంటర్‌ వేస్తామని చెప్పి ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. 41ఏ నోటీసులు తీసుకోకపోతే వెంటనే ఎలా అరెస్టు చేస్తారని నిలదీసింది. కోర్టు అనుమతి తీసుకున్నాకే అరెస్టు చేయాలి కదా అని ప్రశ్నించింది. రిమాండ్ ఉత్తర్వులను కోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. దీంతో బండారు అరెస్టుపై దాఖలైన కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 12కి వాయిదా వేసింది. మంత్రి రోజాను దూషించారని బండారుపై వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బండారు సత్యనారాయణ మూర్తికి రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Spread the love