– గవర్నర్‌తో ముప్పై అబద్దాలు..అరవై మోసాలు చెప్పించారు
– ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి : పల్లా
– శాసనసభలో బీఆర్‌ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై గవర్నర్ ప్రసంగంలో పైపైన తడిమారే తప్ప నిర్ధిష్టంగా చెప్పలేదనీ, ప్రభుత్వం గవర్నర్‌తో ముప్పై అబద్దాలు..అరవై మోసాలు చెప్పించిందని శాసనసభలో బీఆర్‌ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. 420 హామీలను 420 ఫీట్ల లోతులో పాతిపెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. హామీలపై రాష్ట్ర సర్కారు అరచేతిలో వైకుంఠం చూపి 60 రోజుల్లో చేతులెత్తేసినట్టు ఉందని విమర్శించారు. వెయ్యిమంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి రూ.100 కోట్లు విడుదల చేయడం, అంగన్‌వాడీలతో సమావేశం పెట్టి జీతాలు పెంచడం, అఖిలపక్షం పెట్టి దళితబంధు పథకం తీసుకురావడం, రైతుబంధుకు రూపకల్పన చేయడం, సింగరేణి కార్మికులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరించడం వంటివి చేసింది ప్రగతిభవన్‌లోనే అన్న విషయాన్ని మరవొద్దన్నారు. రోజూ ప్రజాభవన్‌లో గంట కూర్చుంటానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరోజుకే పరిమితమయ్యారనీ, 60 రోజుల్లో 6 నిమిషాలు కూడా వినతులు తీసుకోనప్పుడు అది ప్రజాభవన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మంత్రులు కూడా వినతులు తీసుకోవడం లేదని విమర్శించారు. వందల కిలోమీటర్ల నుంచి వచ్చే ప్రజల నుంచి వినతులను ఔట్‌సోర్సింగ్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాభవన్‌కు వచ్చిన వినతులెన్ని? వాటిలో ఎన్నిటికి పరిష్కారం చూపారు? మిగతావాటి పరిస్థితేంటి? తదితరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగ్యారంటీల్లోని 13 అంశాల్లో రెండింటిని మాత్రమే ప్రారంభించారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.20 కోట్లు ఖర్చు చేసి రూ.60 కోట్లు పెట్టి ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి బస్సుల సంఖ్యను, ట్రిప్పులను పెంచలేదని విమర్శించారు. బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకానికి నిధుల విడుదల డైలీ సీరియల్‌ను తలపిస్తున్నదని ఎద్దేవా చేశారు. ఖరీప్‌లోనే రైతుల పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మాటతప్పారనీ, యాసంగిలోనైనా మోసంగి చేయకుండా రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు రుణమాఫీ ఏమైందని నిలదీశారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయనీ, 21 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీ చేయాలని కోరారు. క్రోనీ క్యాప్టలిస్టులకు వేల కోట్ల ప్రాజెక్టులు ఇవ్వడం సరిగాదన్నారు. ఒక్క ఆదానీ కంపెనీతో 12వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల తెలంగాణ ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదానీతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా పల్లా డిమాండ్ చేశారు.