4798 మంది నామినేషన్లు దాఖలు

4798 nominations were filed– అత్యధికంగా గజ్వేల్‌లో 145
– కామారెడ్డిలో 90…మేడ్చల్‌లో 116 నామినేషన్లు
– అత్యల్పంగా నారాయణ్‌పేట్‌లో 13…
– రాష్ట్ర ఓటర్లు 3,26,18,205 మంది మహిళా ఓటర్లే ఎక్కువ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 145 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ‘ధరణి’ బాధితులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారు. ఇక్కడ సీఎం కేసీఆర్‌పై ఆయన క్యాబినేట్‌లోనే మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్యర్థిగా ఆయనపై పోటీ చేస్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడా మాస్టర్‌ప్లాన్‌ బాధితులు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ స్థానంలో మొత్తం 90 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పోటీచేస్తున్నారు. ఆ తర్వాత మేడ్చల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 116 నామినేషన్లు దాఖలయ్యాయి. అతి తక్కువగా నారాయణ్‌పేట్‌ నియోజకవర్గంలో 13 నామినేషన్లు మాత్రమే వేశారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువైన శుక్రవారం ఒక్కరోజే మొత్తం 2,324 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్లను ఓటర్లు పెద్దసంఖ్యలోనే వినియోగించు కొనేందుకు ఆసక్తి చూపారు. 31,551 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి అత్యధికంగా 757 దరఖాస్తులు అందాయి. అతి తక్కువగా మక్తల్‌ నియోజకవర్గంలో ఐదు పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈనెల 13వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అసంపూర్తిగా నామినేషన్‌ పత్రాలు నింపితే, అలాంటి అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తారు. అదే రోజు నామినేషన్ల తుది జాబితా విడుదల అవుతుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత అసలు బరిలో ఉండే మొత్తం అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుంది. 30వ తేదీ పోలింగ్‌, డిసెంబర్‌ 3వ తేదీ ఫలితాలు వెల్లడయ్యే విషయం తెలిసిందే.
ఓటర్లు 3.26 కోట్ల మంది
రాష్ట్ర ఓటర్ల సంఖ్య 3,26,18,205 మందిగా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈనెల 10వ తేదీ వరకు నమోదైన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. వీరిలో పురుష ఓటర్లు 1,62,98,418 మంది కాగా, మహిళా ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,676 మంది అధికంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే 18-19 మధ్య వయసు ఉన్న ఓటర్లు 9,99,667 మంది ఉన్నారనీ, వీరు మొత్తం ఓటర్ల సంఖ్యలో 3.06 శాతంగా నమోదయ్యారని తెలిపారు.
ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 2,676 మంది ఉన్నారు. 15,406 మంది సర్వీసు ఓటర్లు, 2,944 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే వీరి సంఖ్య 8.75 శాతం పెరిగింది. మొత్తంగా ఓటర్ల జాబితాలో 35.73 లక్షల చేరికలు, 9.48 లక్షల తొలగింపులు జరిగాయి. 16.29 లక్షల మంది షిఫ్టింగ్‌, మోడిఫికేషన్లు చేసుకున్నారు. అలాగే 80 ఏండ్ల వయసు పైబడిన ఓటర్ల సంఖ్య 4,40,371 కాగా, దివ్యాంగ ఓటర్లు 5,06,921 మంది ఉన్నారు.
15 రాజకీయ ప్రకటనల నిలిపివేత
ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న పత్రికా ప్రకటనలు, వీడియోలు కాకుండా, వాటిని మార్చివేసి ప్రసారం చేస్తున్న 15 రాజకీయ ప్రకటనల్ని నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఇవి కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన క్రిందికే వస్తాయని స్పష్టంచేశారు. రాష్ట్ర స్థాయి ప్రచారానికి ఎన్నికల కమిటీ సర్టిఫికెట్‌ ఇస్తే, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఆయా ప్రకటనలను తక్షణం నిలిపివేయాలని పలు టీవీ చానళ్లు, పత్రికలకు నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.
రూ.544.27 కోట్ల సొత్తు స్వాధీనం
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.544.27 కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 11వ తేదీ ఉదయం వరకు నిర్వహించిన తనిఖీల్లో నగదుతోపాటు బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, చీరలు, క్రీడాసామాగ్రి, కుక్కర్లు, బియ్యం వంటి వాటిని ఎన్నికల తనిఖీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Spread the love