బండిపై తెలంగాణ హైకోర్టు అసహనం.. 50వేలు ఫైన్

నవతెవలంగాణ – హైదరాబాద్: కరీంనగర్ ఎంపీ, బీజేపీ నాయకుడు బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నేత, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ పలుమార్లు గైర్హాజరయ్యారు. తాజాగా మరోసారి ఆయన గడువు కోరగా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, కాబట్టి మరోసారి గడువు ఇవ్వాలని బండి సంజయ్ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఎన్నికల పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణ ముగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించిన ఆయన గత జులై 21వ తేదీ నుండి మూడుసార్లు గడువు కోరారు. అమెరికా నుండి వచ్చాక ఈ నెల 12వ తేదీన బండి సంజయ్ హాజరవుతారని న్యాయవాది తెలిపారు. దీంతో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

Spread the love