నవెలంగాణ – గాంధీనగర్ : ఆధార్, పాన్ కార్డులను ఫోర్జరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలను పొందినట్లు ప్రైవేట్ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నకిలీ ఉదంతం వెలుగులోకి వచ్చిందని మంగళవారం అధికారులు తెలిపారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వెబ్ సైట్ ద్వారా సుమారు రెండు లక్షలకు పైగా ఆధార్, పాన్ కార్డులతో పాటు ఓటర్ ఐడి కార్డులను ఫోర్జరీ చేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్కటి సుమారు రూ. 15 నుండి రూ. 200లకు విక్రయించినట్లు తెలిపారు. నిందితులు ప్రభుత్వ డేటాబేస్‌ను యాక్సెస్ చేస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని, తీవ్రమైన సమస్య అని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గతవారం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఆర్థిక నేరాల విభాగం) వి.కె. పర్మార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, కీలక నిందితుడి కోసం గాలిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లుగా ఈ నకిలీ వ్యవహారం కొనసాగుతుందని చెప్పారు.