బీజేపీ ఎంపి సన్నీ డియోల్‌ అప్పు ఎగనామం..

నవతెలంగాణ – న్యూఢిల్లీ : బీజేపీ ఎంపి, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అయినా సన్నీడియోల్‌ బ్యాంక్‌ల నుంచి అప్పులు తీసుకుని ఎగనామం పెట్టారు. మధ్యప్రదేశ్‌ నుంచి ఎంపిగా ఎన్నికయిన సన్నీడియోల్‌ 2016లో ఒక సినిమా కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) నుంచి అప్పు తీసుకున్నారు. చెల్లింపులు చేయకపోవడంతో బకాయి రూ.56 కోట్లుకు చేరింది. ఈ పద్దును గతేడాది మొండి బకాయిల జాబితాలో చేర్చారు. రికవరీలో భాగంగా ముంబయిలోని సన్నీకి చెందిన ఓ విల్లాను ఇ-వేలం వేయనున్నట్లు బిఒబి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబరు 25న వేలం జరగనుందని.. ఇందులో పాల్గొనే వారు సెప్టెంబర్‌ 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్‌ ధరగా నిర్ణయించింది. జుహులోని గాంధీగ్రామ్‌ రోడ్‌లో సన్నీ విల్లా, సినీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టూడియో ‘సన్నీ సూపర్‌ సౌండ్‌’ ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయాలని బ్యాంక్‌ యోచించింది. సన్నీ డియోల్‌కు అప్పు తీసుకునేటప్పుడు సన్నీ సౌండ్స్‌ డియోల్స్‌ యాజమాన్యంలోని సంస్థ సహా, సన్నీ డియోల్‌ తండ్రి, బాలీవుడ్‌ హీరో నటుడు, బిజెపి మాజీ ఎంపి. తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీ ఇచ్చారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బిబిపి ఎంపి కావడం విశేషం. కాగా.. బిఒబి అనుహ్యాంగా సన్నీ డియోల్‌కు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. సాంకేతిక కారణాల వల్ల ఇ-వేలంను రద్దు చేశామని బిఒబి వెల్లడించింది. ఈ పరిణామంపై కాంగ్రెస్‌ పార్టీ నేత జైరాం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటల్లోనే ఉపసంహరించుకోవడాన్ని ఆయన విమర్శించారు. బకాయిలను చెల్లించడానికి సన్నీ డియోల్‌కు ముందుకు వచ్చారని తదుపరి ప్రకటనలో బిఒబి వివరణ ఇచ్చింది. కాగా.. ఈ విషయం బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. అప్పు ఎగవేతతో సన్నీడియోల్‌, బిజెపి అపఖ్యాతి మూటగట్టుకున్నట్లయ్యింది.

Spread the love