5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలి

5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలి– మల్టీజోన్‌-1 పదోన్నతుల్లో జరిగిన పొరపాట్లను సవరించాలి : విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి జాక్టో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీలో గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విధంగా 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్‌ చేసింది. 11,12 జీవోలను సవరించి ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో జాక్టో చైర్మెన్‌ జి సదానందంగౌడ్‌, కోశాధికారి కె కృష్ణుడు కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో పదోన్నతులు, బదిలీల ప్రక్రియను మల్టీజోన్‌-1 పరిధిలో పూర్తి చేశారని తెలిపారు. మల్టీజోన్‌-2 పరిధిలో కొనసాగిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు ప్రకటించారు. మల్టీజోన్‌-1 పదోన్నతుల్లో ఒక ఉపాధ్యాయునికి మూడు సబ్జెక్టుల్లో పదోన్నతి వచ్చిందని తెలిపారు. వారు చేరిన సబ్జెక్టు కాకుండా మిగిలిన ఖాళీలను డీఈవోల ద్వారా తెప్పించుకుని ఈ షెడ్యూల్‌లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించాలని కోరారు. పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌ కంటే ముందు ఖాళీగా ఉన్న 900కుపైగా ఉన్న పోస్టులను అర్హత ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని తెలిపారు. మల్టీజోన్‌-1లో బదిలీలు, పదోన్నతుల్లో జరిగిన పొరపాట్లను సవరించి న్యాయం చేయాలని పేర్కొన్నారు. మల్టీజోన్‌-2లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియను షెడ్యూల్‌ ప్రకారం చేయాలని కోరారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Spread the love