అశ్వారావుపేటలో 80.36 శాతం పోలింగ్..

  • పోలింగ్ లో అపశృతి….
  • అనారోగ్యంతో ఇద్దరు మృతి…
  • ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ…
  • సాయంత్రం 7 గంటలకు నియోజక వర్గం పోలింగ్ 80.36 శాతం….
  • అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ పోలింగ్ కు 6.52 శాతం తగ్గుదల….

నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు – 2024, ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం నెంబర్ 17 పరిధిలోని అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నెంబర్ 118 ఎస్టీలో సోమవారం జరిగిన పోలింగ్ లో అపశృతి చోటు చేసుకుని పోలింగ్ అధికారి ఒకరు,ఓటరు ఒకరు వేర్వేరు చోట్ల అనారోగ్యానికి గురై మృతి చెందారు.
ఎటువంటి రాజకీయ అలజడులు లేకుండా పోలింగ్ నాలుగు గంటలకు ముగిసింది.సాయంత్రం 7 గంటలకు అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 80.36 శాతం నమోదు అయింది.గతేడాది డిసెంబర్ లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 86.88 శాతం పోలింగ్ నమోదు అయింది. నాడు 1,55,961 మంది ఓటర్లకు గానూ 1,35,501 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు పార్లమెంట్ ఎన్నికల్లో 1,59,174 ఓటర్లకు గానూ 1,27,918 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అసెంబ్లీ తో పోల్చితే పోలింగ్ శాతం 6.36 శాతం తగ్గింది.

Spread the love