బిపర్‌జాయ్‌ తుఫాను ఎఫెక్ట్‌.. గుజరాత్‌లో 95 రైళ్లు రద్దు

నవతెలంగాణ – గుజరాత్
బిపర్‌జాయ్‌ తుఫాను రేపు సాయంత్రానికి గుజరాత్‌ తీరాన్ని తాకనుంది. అరేబియా సముద్రం తీరంలోని కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు సమీపంలో గురువారం సాయంత్రం నాటికి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనావేసింది. తుఫాను ప్రభావం గుజరాత్‌పై తీవ్రస్థాయిలో ఉండొచ్చని, రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని వెల్లడించింది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వరకూ గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో 6 మీటర్ల ఎత్తున కెరటాలు ఎగసిపడతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిపర్‌జాయ్‌ తుఫాను పోర్‌బందర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాలకు  చెందిన 30 వేల మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు తరలించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. జూన్‌ 15 వరకు ఈ రైళ్లను తాత్కాలికంగా క్యాన్సల్‌ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఆసియా సింహాలకు ఏకైక నివాసమైన గిర్‌ నేషనల్‌ పార్కు, సోమనాథ్‌ ఆలయం వంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఐఎండీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు.

Spread the love