99.86 శాతం పోలింగ్‌

– ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
– ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/కొడంగల్‌
స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో ఖాళీ ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానానికి గురువారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంకాలం 4గంటల దాకా జరిగిన పోలింగ్‌లో 99.86 శాతం స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. 10 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో మెంబర్లు మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1435 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాలో ఇద్దరు మాత్రమే అనివార్య కారణాల వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మహబూబ్‌నగర్‌లో 245, వనపర్తిలో 218, గద్వాలలో 225, కొల్లాపూర్‌లో 67, అచ్చంపేటలో 79, కల్వకుర్తిలో 72, షాదనగర్‌ 171 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో 171 కి 170 మంది, నారాయణపేటలో 205 మందికి 204 మంది ఓటు హక్కను వినియోగించుకున్నారు. 14 మంది ఎమ్మెల్యేలు, ఆరు మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకున్న దామోదర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, రాజేష్‌ రెడ్డి, వీర్లపల్లి శంకర్‌ తదితరులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం
మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌ రెడ్డి తన ఓటు హక్కును.. కొడంగల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో వినియోగించుకున్నారు. ముందుగానే పోలింగ్‌ సమాచారం తెలుసుకున్న పోలీసులు ముఖ్యమంత్రి రాకతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 56 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉండగా.. వారిలో 40 మంది ఎంపీటీసీలు, 12 మంది కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ఎక్స్‌ అఫీషియో సభ్యులైన కొడంగల్‌ ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గెలుస్తామన్న దీమాను సీఎం వ్యక్తం చేశారు. వంద శాతం ఓటింగ్‌ నమోదైనట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. ఇక, ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మన్నె జీవన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌ గౌడ్‌ పోటీలో ఉన్నారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్‌ రెండో తేదీన నిర్వహించి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎవరికి వారే తమ గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. 1439 ఓట్లలో 1000 మందికి పైగా బీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉన్నారు. అయితే 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయింది. తక్కువ స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి నిలబెట్టి కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెంచుకుంది. పోలింగ్‌ ప్రక్రియను ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుధీర్‌ బాబు, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి పర్యవేక్షించారు.

Spread the love