బిగిస్తున్న ఉచ్చు…

– ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు, సీఐ గట్టుమల్లును
– అదుపులోకి తీసుకున్న స్పెషల్‌ టీమ్‌
– రాధాకిషన్‌రావు అరెస్ట్‌
– నేడు కోర్టులో హాజరు
– ప్రణీత్‌రావు డ్రైవర్‌నూ విచారిస్తున్న అధికారులు
– భుజంగరావు, తిరుపతన్నను ఐదు రోజుల కస్టడీకిచ్చిన కోర్టు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను నేడు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, రాచకొండ కమిషనరేట్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లును ప్రత్యేక దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ కేసు వెలుగు చూడగానే.. మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు అమెరికాకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, రాధాకిషన్‌రావు ఆచూకీ కోసం పంజాగుట్ట పోలీసులు లుకౌట్‌ నోటీసులను జారీ చేసిన నేపథ్యంలో బుధవారం రాత్రి నాటకీయంగా అమెరికా నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న స్పెషల్‌ టీమ్‌ పోలీసులు రాత్రి రాధాకిషన్‌రావు నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. అదే సమయంలో మరో అనుమానితుడు ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులు గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని స్పెషల్‌ టీం కార్యాలయానికి చేరుకున్నారు. దాంతో వారిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు వారికి దర్యాప్తు అధికారులు ప్రకటించినట్టు సమాచారం. అలాగే, ప్రణీత్‌రావు డ్రైవర్‌ను కూడా స్పెషల్‌ టీం అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నది. ముఖ్యంగా, మాజీ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు రాధాకిషన్‌రావు, గట్టుమల్లులు సైతం ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులతో పాటు ప్రముఖ వ్యాపారులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్‌ చేసి బెదిరింపు చర్యలు, డబ్బులు దండుకోవటం వంటి చర్యలకు పాల్పడినట్టు ఆరోపణ లున్నాయి. దీంతో, ఆ దిశగానే స్పెషల్‌ టీం అధికారులు ఈ ఇద్దరు ఆఫీసర్లను విచారిస్తున్నట్టు సమాచారం. తమ వద్ద అప్పటి వరకు సేకరించిన కొన్ని ఆధారాలను ముందు పెట్టి మరీ ఈ ఇద్దరు అధికారులను స్పెషల్‌ టీం ఆఫీసర్లు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది.ముఖ్యంగా, ప్రణీత్‌రావు ఇచ్చిన అనేక ఆధారాలు.. ఈ ఇద్దరు అధికారుల పాత్ర ఉన్నట్టు కూడా రూఢ అవుతున్నట్టు స్పెషల్‌ టీమ్‌ అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక పరికరాలను ధ్వంసం చేయటంలోనూ వీరిచ్చిన ఆదేశాలు కూడా పని చేశాయనీ, అదే సమయంలో ప్రణీత్‌రావు డ్రైవర్‌ కూడా ఈ ఆధారాలను ధ్వంసం చేయటంలో కీలక పాత్ర వహించాడని అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తమ్మీద, ప్రభాకర్‌రావును విచారిస్తే మరిన్ని ఆధారాలు ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించినవి బయటపడతాయని స్పెషల్‌ టీం భావిస్తున్నది. ఇప్పటికే అరెస్టైన ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్‌రావులలో ఇద్దరు అదనపు ఎస్పీలను మాత్రమే విచారించటానికి నాంపల్లి కోర్టు గురువారం అనుమతించింది. వారం పాటు వీరిని కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోరగా.. కేవలం ఐదు రోజులు మాత్రమే కస్టడీకిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే, ప్రణీత్‌రావును కస్టడీకివ్వటానికి మాత్రం కోర్టు నిరాకరించింది. వీరిని శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 2 వరకు పంజాగుట్ట స్పెషల్‌ టీం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ఇప్పటికే అదుపులో ఉన్న రాధాకిషన్‌రావు, గట్టుమల్లుతో పాటు ఈ ఇద్దరు అదనపు ఎస్పీలను కూడా కలిపి విచారించే అవకాశమున్నదని తెలుస్తున్నది. మరోవైపు, ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చబడిన ప్రభాకర్‌రావును ఏ విధంగా అమెరికా నుంచి ఇక్కడకు తీసుకురావాలనే విషయమై సీనియర్‌ పోలీసు అధికారులు తర్జన, భర్జన పడుతున్నట్టు తెలుస్తున్నది. అవసరమైతే ఇంటర్‌పోల్‌ సాయాన్ని కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Spread the love