రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది

The role of RTC workers in the achievement of the state cannot be forgotten– వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్‌ రూపొందించాం
– ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీ బలోపేతం
– కాగితాలపై కాక..వాస్తవిక బడ్జెట్‌ పెట్టాం : ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సకల జనుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాను స్తంభింపజేసి రాష్ట్ర సాధన పోరాటానికి సహకరించారని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో 83 ఎలక్ట్రిక్‌ బస్సులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని భావించినా.. అలా జరగలేదన్నారు. 90 రోజులు సమ్మె చేసినా గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఆ సమ్మెలో 36 మంది కార్మికులు మరణించినా ఆనాటి ప్రభుత్వం మృతుల కుటుంబాల గురించి ఆలోచించలేదని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో మొట్టమొదటి హామీని అమలు చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులదే అన్నారు.
గత ప్రభుత్వంలా కాగితాల్లో చూపించినట్టు కాకుండా తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం వాస్తవాల ప్రాతిపదికన రూ. 2,75,891 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని చెప్పారు. దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వా నికి ఆదాయం తగ్గినా ఆర్టీసీకి రూ.281 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీ బలోపేతానికి ఉపయోగపడింద న్నారు. దేశం లోనే తెలంగాణ మోడల్‌ పాలనపై చర్చ జరిగేలా పరిపా లన అందిస్తామని హామీనిచ్చారు. ఆర్టీసీ ఎండీ కోరిక మేరకు మరిన్ని బస్సుల కొనుగోలుకు సహకరిస్తామని చెప్పారు.
ఆర్టీసీని అద్భుత రవాణా సంస్థగా మారుస్తాం : డిప్యూటీ సీఎం
కార్మికులు ఆర్టీసీ సంస్థ అస్థిత్వం కోసం ఎన్నో పోరాటా లు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆర్టీస ీని అద్భుత ప్రయాణ సంస్థగా మారుస్తామని చెప్పారు. ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీపై ఎలాంటి భారం మోపలేద న్నారు. గడిచిన 60 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రయాణికులు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగిం చుకున్నారని, ఈ డబ్బును ప్రభుత్వం నేరుగా ఆర్టీసీకి చెల్లి స్తుందన్నారు.నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా లాభాల్లో నడుస్తోందన్నారు. సంస్థతోపాటు కార్మికులు, ఉద్యోగులను కాపాడుకుంటామని చెప్పారు. నేడు ఆర్టీసీ బల పడుతోందని, మరింత బలోపేతం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.
మూడు సూత్రాలను పాటిస్తున్నాం : మంత్రి పొన్నం ప్రభాకర్‌
ఆర్టీసీని బలోపేతం చేయడానికి సీఎం సూచన మేరకు ‘సంస్థ పరిరక్షణ, సౌకర్యం, కార్మికుల సంక్షేమం’ అనే మూడు సూత్రాలను పాటిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. గతంలో విశ్రాంత ఉద్యోగితో ఆర్టీసీని నడిపించడంతో సంస్థ నిర్వీర్యమైందన్నారు. రాష్ట్రంలో బస్సులకు బాగా డిమాండ్‌ పెరిగిందని చెప్పారు. రానున్న రోజుల్లో నియామకాలు చేపడతామని తెలిపారు. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వెల్లడించారు. త్వరలోనే కారుణ్య నియామక పత్రాలను అందజేస్తామని తెలిపారు.
‘మహాలక్ష్మి’తో ప్రజారవాణాకు మేలు; ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
మహాలక్ష్మి పథకంతో ప్రజా రవాణాకు మేలు జరుగుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. కొత్తగా 100 బస్సులను ప్రారంభిస్తున్నామని, ఇందులో ఎక్స్‌ప్రెస్‌ బస్సులన్నింటినీ ‘మహాలక్ష్మి’ స్కీంకి, సూపర్‌ లగ్జరీ బస్సులను శ్రీశైలంకి నడుపుతామని చెప్పారు. రెండు నెలల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.507 కోట్ల నిధులు విడుదల చేసిందని వివరించారు. కొవిడ్‌, డీజిల్‌ ధరలు, సమ్మె కారణంగా ఆర్టీసీ నష్టాలను చవి చూసిందని, ఇప్పుడిప్పుడే కొద్దిగా నష్టాలు తగ్గుతున్నాయని అన్నారు. దాదాపు రూ.115 కోట్ల నష్టాలను తగ్గించామని చెప్పారు. ప్రభుత్వం సహకరిస్తే మరో వెయ్యి బస్సులు కోనుగోలు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దామని తెలిపారు. అన్ని బస్టాండ్లలో ఉచిత టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love