– వికలాంగులకు మంత్రి కేటీఆర్ హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టటం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి గెలిచి అధికారంలోకి వచ్చాక వికలాంగుల పింఛన్‌ను రూ.6,016కు పెంచుతామని ఆయన హామీనిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ‘వికలాంగుల కృతజ్ఞత’ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే వికలాంగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకూ వారి కోసం తమ ప్రభుత్వం రూ.10,300 కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు. మొత్తం 2.25 లక్షల వాహనాలను వికలాంగులకు అందజేశామని వివరించారు. వారికి వినికిడి యంత్రాలను పంపిణీ చేయటంతోపాటు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. గుజరాత్లో వైకల్య శాతాన్నిబట్టి పింఛన్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లో వికలాంగులకు కేవలం రూ.200 పింఛన్ మాత్రమే వస్తోందని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే… కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇక్కడికొచ్చి లేని పోని అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.