కైరో : ‘మీ కోసం మేం త్యాగాలు చేస్తాం పాలస్తీనా’ అంటూ శుక్రవారం లక్షల మంది ఈజిప్షియన్లు నినదించారు. సమిష్టి ప్రార్ధనల అనంతరం ‘ఈజిప్ట్ ఫ్రైడే’ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనా పతాకాలు, ‘సేవ్ గాజా’ పోస్టర్లు ధరించి ప్రదర్శకులు పాల్గొన్నారు. కైరోలోని నాసర్ సిటీ జిల్లాలో ప్రధాన వీధిలో ఈ ప్రదర్శన జరిగింది. మరోవైపు ఇజ్రాయిల్ దురాక్రమణ ఫలితంగా సినారు ద్వీపకల్పంలోకి చొచ్చుకురావాలని ప్రయత్నిస్తున్న వేలాదిమంది పాలస్తీనియన్లను ఈజిప్ట్ తిరస్కరిస్తోంది. నిర్వాసితులైన పాలస్తీనియన్లకు ఈజిప్ట్ ఆతిథ్యమివ్వాల్సి వస్తే, సినారు ప్రతిఘటనా కార్యకలాపాల క్షేత్రంగా మారగలదని, ఈజిప్ట్ భూబాగంపై ఇజ్రాయిల్ దాడి చేయగలదని ఈజిప్ట్ అధ్యక్షుడు అల్ సిసి హెచ్చరించారు. అవసరమైతే వేలాదిమంది ఈజిప్టియన్లు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తారని ఆయన పేర్కొన్నారు. పాలస్తీనియన్ల ప్రయోజనాలకు మద్దతుగా, గాజాలో జరుగుతున్న ప్రతిదాన్నీ వ్యతిరేకిస్తూ, ఈజిప్ట్ నేతకు ఆమోద ముద్ర తెలియచేస్తూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు జిహాద్ మహమూద్ అనే మహిళ తెలిపారు.
లండన్‌లో భారీ ప్రదర్శన
గాజాలో తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని, మానవతా సాయాన్ని అందజేయాలని కోరుతూ లండన్‌లో పాలస్తీనా అనుకూల మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. గత శనివారం జరిగిన ప్రదర్శనలో దాదాపు లక్షా 50వేల మంది పాల్గొన్నారు. ఈసారి అంతకంటే ఎక్కువమందే హాజరయ్యారని పాలస్తీనా సంఘీభావ కేంపైన్ డైరెక్టర్ బెన్ జమాల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. హింసకు మూల కారణాన్ని పరిష్కరించనిదే ఈ ఉద్రిక్తతలు చల్లారవని జమాల్ పేర్కొన్నారు.
గాజాపై బాంబు దాడుల్లో కాలిన గాయాలతో బాధపడుతున్న వారిలో 80శాతం మంది చిన్నారులేనని, వారికి కనీసం డ్రెస్సింగ్‌లు కూడా అందుబాటులో లేవని గాజాలో డాక్టర్లు తెలిపారు.
పాలస్తీనాకు గ్రెటా థన్‌బర్గ్ సంఘీభావం
ఇజ్రాయిల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న పాలస్తీనా, గాజా వాసులకు వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ మద్దతునిచ్చారు. తనతోపాటు మరో నలుగురు కార్యకర్తలు పాలస్తీనా, గాజాకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫొటోలను గ్రెటా తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గ్రెటా పాలస్తీనాకు సంఘీభావం తెలపడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అమాయక ఇజ్రాయెల్‌లను చంపిన హమాస్.. తమ రాకెట్ల కోసం స్థిరమైన పదార్థాలను ఉపయోగించలేదు. హమాస్ ఊచకోత బాధితులు మీ స్నేహితులు కావొచ్చు. దీనిపై మాట్లాడండి.’ అని ఇజ్రాయెల్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. హమాస్ దాడిలో హత్యకు గురైన ముగ్గురు 19 ఏండ్ల ఇజ్రాయిలీల ఫొటోలను పోస్ట్ చేసింది. ఇజ్రాయిల్ స్పందనపై గ్రెటా తీవ్రంగానే స్పందించారు. ‘స్టాండ్ విత్ గాజా’ అనే ప్లకార్డును తాను పట్టుకుని ఉన్న ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఈరోజు మేము పాలస్తీనా, గాజాకు సంఘీభావంగా సమ్మె చేస్తున్నాం. తక్షణమే కాల్పులు విరమించండి. పాలస్తీనియన్లకు, బాధిత పౌరులకు స్వేచ్ఛ, న్యాయం కోసం ప్రపంచం మాట్లాడాలి’ అని పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో గ్రెటా థన్‌బర్గ్ పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు గ్రెటాకు మద్దతునిస్తున్నారు.