ఎన్నికల తాయిలాలు అభ్యర్థుల ఖాతాల్లో కలపండి

Add election results to candidates' accounts– మద్యం కట్టడికి ఆధునికంగా ఆలోచించండి
–  పోస్టల్‌ బ్యాలెట్లు ముందే అందచేయండి: రాష్ట్ర ఎన్నికల అధికారులకు సీఈసీ కేంద్ర బృందం ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో పట్టుబడిన ఎన్నికల తాయిలాలు, బహుమతుల ధరను లెక్కగట్టి, నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో ఆ మొత్తాన్ని కలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రత్యేక బృందం రాష్ట్ర అధికారులను ఆదేశించింది. అదే సమయంలో ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధం లేని సామాన్యుల నగదు పట్టుబడితే, సాక్ష్యాధారాలు పరిశీలించి, వాటిని తిరిగి ఇచ్చేసే విషయంలో పారదర్శకంగా ఉండాలని చెప్పింది. ఈనెల 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటు నామినేషన్లు కూడా స్వీకరించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన సీఈసీ ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్‌ కుమార్‌ వ్యాస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్‌ల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యింది. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌, అదనపు సీఈఓ లోకేష్‌ కుమార్‌, జాయింట్‌ సీఈఓ సర్ఫరాజ్‌ అహ్మద్‌, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా రాష్ట్రంలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు, గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, కేంద్ర సాయుధ దళాల వినియోగం తదితర అంశాలను కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ఆయా విభాగాల ఉన్నతాధికారులతో వేర్వేరుగా కేంద్ర బృందం భేటీ అయ్యి, ఏర్పాట్లను అడిగి తెలుసుకుంది. డీజీపీ అంజనీ కుమార్‌ పోలీసు బందోబస్తు, శాంతి భద్రతల పరిస్థితుల్ని వివరించారు. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ రాష్ట్రంలో మద్యం క్రయవిక్రయాలు, అక్రమ మద్యం స్వాధీనం, తనిఖీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వాణీ ప్రసాద్‌ పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, తనిఖీలు, ప్రత్యేక బృందాల నియామకం తదితర అంశాలను తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలన నోడల్‌ అధికారి, అడిషనల్‌ డీజీపీ మహేష్‌ భగవత్‌, రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారి సంజరు కుమార్‌ జైన్‌, రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సెంట్రల్‌ రిజర్వుడ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) ఐజీ చారుసిన్హా, వాణిజ్య పన్నులశాఖ కమీషనర్‌ క్రిస్టినా చోంగ్తు. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ బుద్ధ ప్రకాష్‌ తదితరులు హాజరయ్యారు. కేంద్ర బృందంలోని అధికారులు వేర్వేరుగా ఆయా శాఖలకు చెందిన అధికారులతో భేటీ అయ్యి, సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకోవడానికి సాంప్రదాయ పద్దతులు కాకుండా ఆధునికంగా ఆలోచించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించారు.
దీనికోసం సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. కాల్‌సెంటర్‌ నెంబర్‌ 1950 వినియోగం, వస్తున్న ఫిర్యాదులు, సువిధ పోర్టల్‌, ఆన్‌లైన్‌ ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన సీ-విజిల్‌, ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు, వాటి పనితీరును తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా తుది సవరణల తరువాత పెండింగ్‌ దరఖాస్తుల స్థితి, ఓటరు కార్డుల పంపిణీ, ఓటర్ల సమాచార స్లిప్‌ల పంపిణీ ఏర్పాట్లు వంటి పలు అంశాలను కేంద్ర బృందం అధికారులు పరిశీలించారు. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ (ఎమ్‌సీఎమ్‌సీ) సర్టిఫికెట్లను రోజువారీగా జారీ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మకంతో పాటు కీలక పోలింగ్‌ కేంద్రాల్లో నిఘా కెమెరాల ఏర్పాట్లను సమీక్షించారు. దినపత్రికలు, వార్తా ఛానళ్ల కవరేజీనీ పరిశీలించారు. ఇంటివద్ద నుంచే ఓటు వేయాలనుకునే సీనియర్‌ సిటిజన్‌లు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించిన ఫారాలను ముందుగానే అందచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల వద్ద వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గురువారం కూడా కేంద్ర బృందం హైదరాబాద్‌లోనే మకాం వేసి, సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది. దీనిలో రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా పాల్గొంటారు.

Spread the love