నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం– అందుకే సీఎంపై పోటీ చేస్తున్నా..
– మల్లన్నసాగర్‌ బాధితుడు ఆడియాల కర్ణాకర్‌రెడ్డి
– గజ్వేల్‌లో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌
నవతెలంగాణ-తొగుట
ప్రభుత్వం మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యలను నిర్లక్ష్యం చేసినందుకు నిరసనగా గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని ఆడియాల కర్ణాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2016లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎకరాకు రూ.6 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో నిర్వాసితులను కులాలుగా విడగొట్టి డబ్బులు ఆశా చూపి మోసం చేశారని తెలిపారు. వేములఘాట్‌ గ్రామంలో నిర్వాసితులందరమూ ఏకమై 900 రోజులకుపైగా ధర్నా నిర్వహించామని, తమ సమస్యలను పరిష్కరించాలని నాయకులు, అధికారులకు విన్నపాలు చేసినా ఫలించలేదన్నారు. 2019 జనవరిలో ఎకరానికి రూ.11.50 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదిరితే.. రూ.11 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అదీ అందరికీ అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021 మార్చిలో వేములఘాట్‌ ప్రజలను గ్రూపులుగా విభజించి గ్రామాన్ని ఖాళీ చేయించి, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి తీసుకొచ్చారని తెలిపారు. గ్రామప్రజలంతా ఒక్కచోటే ఉంటామనుకుంటే.. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ పూర్తిగా నిర్మాణం కాకముందే మధ్యలో నుంచి త్రిబుల్‌ ఆర్‌ రోడ్‌ ఏర్పాటు చేశారన్నారు. దానివల్ల గ్రామాన్ని 7 ముక్కలుగా చేసి కుక్కులు చింపిన విస్తారకులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 ఫిబ్రవరి నెలలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ప్రారంభం రోజు సీఎం కేసీఆర్‌.. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.100 కోట్లు ఇస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం తమకు చేసిన ద్రోహానికి నిరసనగా సీఎంపై మరికొంతమంది నిర్వాసితులు నామినేషన్‌ వేస్తారని తెలిపారు.

Spread the love