గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ నామినేషన్‌ దాఖలు

గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ నామినేషన్‌ దాఖలు– జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ తరపున..
– ముమ్మరంగా స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లు పలు జిల్లాల్లో కొనసాగుతున్న ప్రక్రియ
నవ తెలంగాణ-విలేకరులు
ఐదవ రోజున మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి హుజురాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, జనగామలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అలాగే, సిర్పూర్‌(టి) నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తరపున పార్టీ నాయకులు అర్షద్‌ ఉస్సేన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వారితో పాటు పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మరో మూడు రోజుల్లో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో అన్ని పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. గజ్వేల్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు మరో ఐదుగురు నామినేషన్‌ పత్రాలు వేశారు. గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున, స్వాతంత్ర అభ్యర్థులుగా బొంగుల రాజు, కర్ణాకర్‌ రెడ్డి, మండల నరసింహులు, సదానంద రెడ్డి నామినేషన్‌ పత్రాలను సమర్పించినట్టు ఎన్నికల అధికారి బన్సీలాల్‌ తెలిపారు. ఈటల రాజేందర్‌ నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదవ రోజు 31 మంది నామినేషన్లు వేశారు. రంగారెడ్డి జిల్లాలో 27 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్‌ వేయగా.. వికారాబాద్‌ జిల్లాలో నలుగురు వేశారు. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, తాండూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుర్ర వెంకటయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లాలో ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 26 మంది ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నామినేషన్లు దాఖలయ్యాయి. సిర్పూర్‌(టి) నియోజకవర్గం నుంచి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తరపున పార్టీ నాయకులు అర్షద్‌ ఉస్సేన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రెండో నామినేషన్‌ స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేష్‌, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా జాడి దీపక్‌, ఇండియన్‌ ప్రజాబందు పార్టీ అభ్యర్థిగా కామ్రే నగెేష్‌, నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్‌లో ఒక స్వతంత్ర అభ్యర్థి, మంచిర్యాలలో బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్‌ రావు నామినేషన్లు వేశారు. ముధోల్‌, చెన్నూర్‌లో ఒక్కోచోట రెండు నామినేషన్లు దాఖలు చేశారు. బోథ్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌ నుంచి ఒకటి కూడ నామినేషన్‌ రాలేదు.
ఖమ్మం నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజరు కుమార్‌ నామినేషన్‌ సెట్‌ను నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహార, సుడా చైర్మెన్‌ విజరు కుమార్‌, జడ్పీటీసీ ప్రియాంక దాఖలు చేశారు. పాలేరులో బీజేపీ అభ్యర్థి రవికుమార్‌ నున్న నామినేషన్‌ వేశారు. ఇల్లందులో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోరం కనకయ్య నామినేషన్‌ వేశారు.
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వైరా, సత్తుపల్లిలో ఒక్కో స్వతంత్ర అభ్యర్థి, ఖమ్మం, పాలేరులో ఇద్దరు చొప్పున తమ నామినేషన్లు దాఖలు చేశారు.
జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సింగారపు ఇందిర, ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రేమ్‌రెడ్డి రిపిక నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పద్మతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లు సమర్పించారు. పాలకుర్తి, వరంగల్‌లో ఒక్కో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మూడు నామినేషన్‌ దాఖలయ్యాయి.

Spread the love