నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 30 వ తేదీ పోలింగ్ రోజున అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే ప్రజలను కోరారు.తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికలు 2023 పురస్కరించుకొని శుక్రవారం నాడు కలెక్టరేటు కార్యాలయంలో మీడియా సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను వివరించారు. భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి నామినేషన్స్ చివరి రోజైన ఈరోజు వరకు 29 మంది అభ్యర్థులు 44 నామినేషన్ సెట్స్ వేశారని, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 31 మంది అభ్యర్ధులు 49 నామినేషన్ సెట్స్ వేశారని తెలిపారు. వీటిపై ఈనెల 13 న రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో పరిశీలన జరుగుతుందని, 15 న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్స్ ఉపసంహరణకు సమయమని తెలిపారు. ప్రతి అభ్యర్ధికి ఎన్నికల ఖర్చు 40 లక్షల లోపు ఉంటుందని, ఎన్నికల ఖర్చు వివరాల నమోదు కోసం అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీములు, వీడియో సర్వైలెన్స్ టీములు, వీడియో వీవింగ్ టీములు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు ఈనెల 9 నుండి క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను సి -విజిల్ యాప్ ద్వారా నమోదు చేయవచ్చునని, ఇప్పటి వరకు 39 ఫిర్యాదులు నమోదు అయ్యాయని, వీటిలో 16 ఫిర్యాదులు ప్రజలు టెస్టింగ్ కోసం చేశారని, 2 ఫిర్యాదులు పోచంపల్లి గోదాము గురించి వచ్చినాయని, వాటిని పరిష్కరించడం జరిగిందని, మిగతా ఫిర్యాదులు ప్రచార ప్లెక్సీలు, పోస్టర్స్ పై వచ్చాయని, వాటిని పరిష్కరించడం జరిగిందని తెలిపారు. సి -విజిల్ యాప్ గ్రామ స్థాయిలో అందరికి అవగాహన కలిగేలా ప్రచారం చేస్తున్నామని, ఎన్నికలలో నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఫోటో పంపించితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మీడియా ద్వారా ప్రజలను, ఓటర్లను కోరేదేమింటంటే మీరు సి -విజిల్ యాప్ వినియోగించాలని, తద్వారా ఎన్నికలను పారదర్శకపూర్వకంగా జరిగేందుకు సహకారం ఆదించాలని కోరారు. దీనితో పాటు 1950 ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చునని, ఈ రోజు వరకు 123 ఫిర్యాదులు అందాయని, వీటిలో చాలా వరకు సందేహలు వ్యక్తం చేశారని, వారికి సరైన సలహాలు అందించడం, సంబంధిత పరిష్కారాలను తెలుపడం, సంబంధిత రిటర్నింగ్ అధికారులకు వాటి సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. గత అక్టోబరు 4 న ఫైనల్ ఓటరు జాబితా పబ్లిష్ జరిగిందని, 11,108 మంది ఓటర్లు పెరిగారని, భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 2 లక్షల 86, 941 ఓటర్లు ఉన్నారని, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 2 లక్షల 33 వేల 267 ఓటర్లు ఉన్నారని, ఇందులో 18 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 3431 మంది యువ ఓటర్లు కలిశారని తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, జిల్లాలో ఇప్పటి వరకు 3 కోట్ల 30 లక్షల 58 వేల నగదును జప్తు చేయడం జరిగిందని, 5 కిలోల బంగారం, 7 కిలోల వెండి, 2 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని, ఒక లక్షా 11 వేల లీటర్ల అక్రమ రవాణా మద్యాన్ని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి 74 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 73 దరఖాస్తులను క్లియర్ చేయడం జరిగిందని తెలిపారు. ఒక కేసులో పది లక్షలకు పైగా నగదు ఉన్నందున ఐటి శాఖ వారికి తెలుపడం జరిగిందని అన్నారు. సువిధ ద్వారా అనుమతులు పొందవచ్చునని, ఇచ్చిన అనుమతులకు సంబంధించి సభలు, ర్యాలీలు, సమావేశాలను వివిధ టీములు పర్యవేక్షిస్తాయని తెలిపారు. జిల్లాలో ఎన్నికల పర్యవేక్షణకు సి.ఎన్. మహేశ్వరన్ సీనియర్ ఐఎఎస్ అధికారి సాధారణ పరిశీలకులుగా వచ్చారని, వారికి కూడా ఫిర్యాదులు అందించవచ్చునని, ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కలెక్టరేటులోని స్టేట్ ఛాంబర్లో వారు ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ గా సీనియర్ డిఫైన్స్ అధికారి రాకేశ్ కుమార్ పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలీసు అబ్జర్వర్ ఎన్నికలను పరిశీలిస్తారని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న 13 అత్యవసర విభాగాలకు చెందిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 80 సంవత్సరాలు పైబడిన 159 సీనియర్ సిటిజెన్స్, 152 మంది దివ్యాంగులకు, భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 80 సంవత్సరాలు పైబడిన 177 మంది సీనియర్ సిటిజెన్స్, 132 మంది దివ్యాంగులకు 12D ఫామ్ ద్వారా వారికి ఎన్నికల నిబంధనల మేరకు ఇంటి వద్దనే ఓటు వేయడం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30 న పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికలలో మీ వంతు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేశ్ చంద్ర, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు ఎ. భాస్కరరావు పాల్గొన్నారు.