Sunday, April 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిశ్వాసాలపై వివాదాలు,మతాలతో రాజకీయాలు

విశ్వాసాలపై వివాదాలు,మతాలతో రాజకీయాలు

- Advertisement -

ఒక వైపున నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఓటమి, మరో వైపున అయిదు రాష్ట్రాల ఎన్నికల పోరాటం,దాంట్లో మళ్లీ సర్‌ తతంగాలు,అంతర్జాతీయంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దురాక్రమణ యుద్ధం ఇవన్నీ జరుగుతుంటే కొంతమంది మాత్రం మత రాజ కీయాలు చేయడంలో మునిగి తేలుతున్నారు. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే ఏదో జరిగిపోయిందనీ, మత విశ్వాసాలు దెబ్బతీశారనీ మనోభావాలు దెబ్బతి న్నాయని నిరంతర ఫిర్యాదులు తీసుకొచ్చి భావావరణాన్ని ఉద్రిక్త పర్చడం మతతత్వ శక్తుల ఎత్తుగడగా తయారైంది. పోస్ట్‌ట్రూత్‌ అనబడే మీడియా టెక్నిక్‌లో పరస్పరం సంబంధం లేని విషయాలను గుప్పిస్తూ అసందర్భంగా ముందుకు తెస్తూ నిజమైన సమస్యలు పక్కకు మళ్లిస్తుంటారు. మళ్లీ అదే పాలకులు డైవర్షన్‌ అని ఆరోపిస్తుంటారు. ఏది సమాజ సంబంధమో, ఏది వ్యక్తిగతమో, ఏది దురుద్దేశపూరితమో, ఏది కపటమో తెలుసుకునేలోగా జరగాల్సిన హాని జరిగిపోతుంటుంది. తీరా నిజం తెలిసేసరికి ఎవరికీ దానిమీద ఆసక్తి వుండదు. కొలిమి రాజేసిన మీడియా దాని కొనసాగింపుపై శ్రద్ధ చూపదు. ఇదంతా ఒక వలయంలా సాగు తుంటుంది.

ప్రకాశ్‌రాజ్‌పై దాడి
ఈ పరంపరలో మరీ ప్రమాదకరమైనవి మత పరమైన కృత్రిమ వివాదాలు. దేశమంతా మహిళా రిజర్వేషన్‌ మాయోపా యాల గురించి చర్చిస్తుంటే ప్రకాశ్‌రాజ్‌ కేరళలో ఏదో రాముడిని కించపర్చే వ్యాఖ్యలు చేశారని వివాదం మొదలు పెట్టారు, నిజంగా ఆయన ఏమన్నాడో తెలిసేలోగా అనేక చోట్ల కేసులు వేశారు. ఎప్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆరెస్సెస్‌-బీజేపీ అనుకూల వ్యాఖ్యాతలు, చానళ్లు, సోషల్‌ మీడియాలు ఆయన మహాపరాధం చేశాడనే వాతావరణం సృష్టించారు. ఉత్తరాది నుంచి వలసకూలిగా వచ్చాడని ఆయన అన్నట్టు హోరెత్తించారు. దేశబహిష్కరణ,శిరచ్చేదం,అంగచ్చేదం చేయాలంటూ రెచ్చిపోయారు. మత విషయాలు జాగ్రత్తగా మాట్లాడాలని కొంత మంది సన్నాయి నొక్కులు నొక్కారు. జన సేన ఎమ్మెల్సీ నాగబాబు హిందూ మతాన్నే ఎందుకు ఇలా అంటారని ధ్వజమెత్తారు. అన్ని ధర్మాలకు ప్రతీక రాముడిని అనడం దారుణమని ఆక్షేపిం చారు. హిందూ మతం మాత్రమే నాస్తిక త్వానికి కూడా చోటు కల్పించిందని ఆయనే ముక్తాయిం చారు. తమిళనాడులోసీపీఐ (ఎం) అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ ఆ దశలోనే తన సమాధానం విడుదల చేశారు. హిందూమతాన్నే కాదు, ఏ మతాన్ని కించపర్చే వ్యాఖ్యలు తాను చేయలేదనీ చేయననీ స్పష్టత ఇచ్చారు. కొంతమంది కావాలని చేస్తున్న ప్రచారాలకు తగు సమయంలో సమాధానమి స్తానని ప్రకటించారు. దీనికి ముందు ప్రకాశ్‌రాజ్‌ తల్లి స్వర్ణలతా రాజ్‌కు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చర్చిలో అంత్యక్రియలు నిర్వహించారని ఈ శక్తులే దాడిచేశాయి. తాను నాస్తికుడననీ అయితే తన తల్లి విశ్వాసాలను గౌరవించి ఆమె అంత్యక్రియలు చేశాననీ ఆయన సమాధానమిచ్చారు. ఇంతకూ ప్రకాశ్‌రాజ్‌ రాముడు వలస కూలీ అని అన్నాడా అంటే అనలేదు. ఉత్తరాది నుంచి రామలక్ష్మణులు వస్తున్నారని మాత్రమే అన్నారు. ఆకలివేసి అక్కడ రావణాసురుడి తోటలో ఫలం తిన్నారని, దానికి శూర్పణఖ డబ్బులు అడిగితే జిఎస్‌టి కలిపి చెప్పారట. రావణుడు కాస్త ఇరవై శాతం రాయితీ ఇచ్చాడట. ఇలా ఏదో తమాషాగా చెప్పడం తప్ప ఇందులో అవమానించడం, కూలీ అనడమే లేదు. ఉత్తరాది ఆధిపత్యం హిందీభాష రుద్డడమనే భావనకు వ్యతిరేకిస్తూ ఒక సాహిత్య సదస్సులో చెప్పిన కథ. రామలక్ష్మణులు ఉత్తరాది నుంచి వచ్చారనడానికి అభ్యంతరమేమిటి? అయోధ్యలోనే ఆయన ఆలయం కట్టారు కదా? ఆ మాట తమిళులు ఎప్పటినుంచో చెప్పడమే గాక రావణలీల కూడా జరుపతుంటారు. కేరళ ప్రజలు రాక్షసరాజు బలిచక్రవర్తి ఆగమనాన్ని స్వాగతిస్తూ ఓనం పండుగ జరుపుతారు.ఇవన్నీ భారతీయ సంసృతి వైవిధ్య వైభవాన్ని తెలిపే ఉదాహరణలు. ఏకరూప సంసృతి వద్దన్నదే ప్రకాశ్‌ రాజ్‌ మాటల సారాంశం.వివరణ ఇచ్చేప్పుడు ఇంకా ఏమైనా చెప్పే అవకాశముంది.

గొంతేనమ్మ, రామాలయం గొడవ
ఇది ఇలా వుంటే ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణం రాజు ఆకివీడును మరో అయోధ్యగా మార్చి బీజేపీని మెప్పించాలని చూస్తున్నారు. అక్కడ దళిత వాడలో తరతరాలుగా వున్న వారి స్థానిక దేవత గొంతేనమ్మ ఆలయం స్థానంలో రామాయలం కట్టిస్తానని ప్రకటిం చడమే గాక విహెచ్‌పి వంటి సంస్థల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. క్రైస్తవమతం స్వీకరించిన దళితులకు రిజర్వేషన్‌ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా పదేపదే ప్రస్తావిస్త్తూన్నారు. చుట్టుపక్కల చర్చిల జాబితా ఫొటోలు సేకరించి వాటికి అనుమతి లేదనీ తొలగించాలని రాజకీయ ఒత్తిడి పెడుతున్నారు. దీనిపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ విచారణకు వచ్చినపుడు స్టే ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి అధికారుల అనుమతి వచ్చాకే రామాలయ నిర్మాణం మొదలు పెడతానని చెప్పారు. అయితే తనను విమర్శిస్తున్న వారిని నీలికుమారులని సంబోధించడం,వారి ప్రార్థనాశైలిని అనుకరిస్తూ మాట్లాడటం ఇవన్నీ ఆయన సహజశైలిలో సాగుతున్నాయి.1934 నుంచి అది రామాలయంగా నమోదై వుందని ఆయన వాదన, గొంతేనమ్మ అన్న దేవతకు రూపమే లేదని ఒక జాతర సమయంలో తప్ప మిగిలిన సమయంలో ఏమీ వుండదని చెబుతున్నారు, భారతదేశంలో గ్రామదేవతకు సనాతన సంప్రదాయాలతో ఆ దేవతలను పోల్చి రూపం లేదని చెప్పడం చెల్లేది కాదు. కొంతకాలం కిందట చినజియర్‌ స్వామి కూడా సమ్మక్క సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలు ఇలాగే దుమారం రేపాయి. వాస్తవానికి గ్రామదేవతల దిగువ కులాల ఆలయాలలో పూజారులు కూడా బీసీలు మహిళలే వుండటం కద్దు.హిందూత్వ పేరిట ఏకశిలా సదృశమైన మతవిశ్వాసాలనూ పూజా విధానాలనూ రుద్డడానికి లేదు.(అదే జాతరలో బన్‌మస్క్‌లో ఏదో కలిపారంటూ ముస్లిం చిరువ్యాపారులపై దాడి చేయడం,ఆ ఒత్తిడితో తర్వాత ఒకరు చనిపోవడం కూడా ఇటీవలి ఘటనే) ఆకివీడులో ఆస్తి పత్రాలు, ఆచారాల మాట ఎలా వున్నా వివిద తరగతుల ప్రజల మధ్య వివాదం పరిష్కారం చేయాలి గానీ మరింత రగిలించడం ఏం న్యాయం? పైగా ఈ వ్యవహారంలో నేరుగా సంఘ పరివార్‌ ప్రతినిధులను చేర్చడం, ఆకివీడును అయోధ్యతో పోల్చడం చూస్తే ఒక పథకం ప్రకారమే అంతా జరుగుతున్నట్టు తెలిసిపోతుంది. ఈ క్రమంలో దళిత సంఘాలనూ, ప్రజా సంఘాల నాయకులనూ అరెస్టు చేయడం, పదేపదే ఉద్రిక్తత పెరగడం చూస్తున్నాం మరి లౌకిక పక్షమైన తెలుగుదేశం తమ నాయకుడి చర్యలను ఆమోదిస్తుందా, అండగా వుంటుందా అన్నది పెద్ద సవాలే. గతంలో తెలుగు రాష్ట్రాలలో తిరుపతి లడ్డూతో సహా ఇలాంటి చాలా సమస్యలు పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు,

సుప్రీంకోర్టు శబరిమలై కేసు
వీటన్నిటినీ మించిన రాజ్యాంగ ప్రాధాన్యత గలది సుప్రీంకోర్టులో ప్రస్తుతం జరుగుతున్న విచారణ. శబరిమల ఆలయంలో 10-50 ఏళ్ల మధ్య మహిళలు ప్రవేశం కల్పించవచ్చని రాజ్యాంగ ధర్మాసనం 2018లో తీర్పునిచ్చింది. దానిపై దుమారం లేవదీసిన వివిధ సంస్థలు మళ్లీ విచారించాలని కోర్టును ఆశ్రయించాయి. మతసామరస్యానికి కట్టుబడిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సహజంగానే సహేతుక వైఖరితో వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ నిబంధనల మేరకు సంస్కర్తలనూ సంప్రదాయవాదులను కూడా సంప్రదించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు నివ్వాలనే వైఖరి తీసుకున్నది. సుప్రీంకోర్టు తన తీర్పును తనే సమీక్షించాలని నిర్ణయించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏముం టుంది? అదే సమయంలో కేవలం సనాతన సంప్రదాయం అన్నట్టు గాక సంస్కర్తలను కూడా సంప్రది ంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్త్రీలకు సంబంధించిన శరీర విజ్ఞానం, సంప్రదాయ నమ్మకాలను లోతుగా చూడాలని కూడా చెబుతున్నది. గతంలో తీర్పు వచ్చినపుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో తొందరప డలేదు. తిరుమల తరహాలోనే అక్కడ రకరకాల సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగినా వాటిని కేంద్ర నాయకులు కూడా రాజేసినా చట్ట ప్రకారం వ్యవహరించాలనే వైఖరి తీసుకున్నది.

సుప్రీంకోర్టులో కేంద్రం రతపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అత్యంత తిరోగామి వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితులలోనూ మత విశ్వాసాల విషయంలో జోక్యం చేసుకోరాదన్నారు, అయ్యప్ప బ్రహ్మచారి గనక మహిళల రానివ్వకపోవడం సరైందేనని సమర్థిం చారు. కొన్నిచోట్ల ఆలయాల్లోకి పురుషులను రానివ్వడం లేదు కదా అని వితండవాదన చేశారు. ధర్మాసనంలో వివిధ మత విశ్వాసాలను చెందిన తొమ్మిదిమంది న్యాయ మూర్తులు న్నారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌, న్యాయమూర్తులు బివి నాగరత్న అషదుద్దీన్‌ అమానుల్లా, అరవింద్‌ కుమార్‌,అగష్టీన్‌ జార్జి మెస్సయ్య, ప్రసన్న బి.వార్లే, ఆర్‌.మహదేవన్‌, జోరు మాయా బాగ్చిలు కేసు విచారణ సందర్భంలో రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగం 25(2)(బి) అధికరణంలో ఇచ్చిన మత స్వేచ్ఛ నియమం ప్రకారం పూజా విధానాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? అని పదే పదే ప్రశ్నిసు న్నారు. జస్టిస్‌ నాగరత్న మాత్రం మహిళలకు ప్రవేశం కల్పించకపోవడం వారి ప్రాథమిక హక్కులకు సమానతా సూత్రానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ముస్లిం మహిళలు మసీదులకు రానివ్వకపోవడం వల్లనే వారు ఇళ్లలోనుంచి ప్రార్థన చేసుకుంటారని న్యాయమూర్తి ఒకరు వివరించారు. ఏమైనా మత విషయాలలో జోక్యమే కూడదంటే గతంలో సతీసహగమనం,బాల్య వివాహాలు జంతుబలుల నిషేదం వంటివి సాధ్యమై వుండేవా అని సందేహాలు రాకమానవు. ఏది మూఢత్వం, ఏది నమ్మకం అనేది కూడా నిర్దిష్టంగా తేల్చాలని కోర్టులో చర్చ వచ్చింది. మత స్వాతంత్య్రం అన్నది ఒక మతస్తులు మరో మతం వారికి వ్యతిరేేకంగా చేయకుండా చూడటానికే గానీ ప్రజాశ్రేయస్సు ప్రజారోగ్య పరిరక్షణ వంటివాటికోసం ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని భావించరాదని న్యాయమూర్తులు అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ఇందుకు తగిన చట్టాలు చేస్తే వాటి చెల్లు బాటును తాము పరిశీలించగలమనే భావం వెలిబుచ్చారు. మతాలలో కులాలు వర్గాల ప్రస్తావన కూడా వచ్చింది. నగసాధువులను నిషేదించగలమా అని కొందరడిగారు. ప్రార్థనా స్థలాలలో 1947 ఆగష్టు 15 నాటి యథాతథ స్థితిని కొనసాగించాలని పార్లమెంటు చట్టం వున్నప్పటికీ కిందనుంచి పైదాకా, వారణాసి నుంచి మదురై దాకా అనేక ఆలయ మసీదు వివాదాలు తిరగదోడటం కూడా చూస్తున్నాం. కనకనే రాజకీయంగానూ న్యాయపరంగానూ మతపరమైన సంబం ధాలు దెబ్బతినకుండా చూసుకోవడం కీలకమవుతుంది. మొత్తంపైన ఈ విషయాలలో న్యాయవ్యవస్థ సందిగ్ధంలో వున్నట్టు, ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు అర్థమవుతుంది. దీనిపైన తుది తీర్పుఎలా వుంటుందో చూడాల్సిందే.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -