Sunday, April 26, 2026
E-PAPER
Homeమానవిఅర్థమయ్యేలా చెప్పాలి

అర్థమయ్యేలా చెప్పాలి

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
ఎలా ఉన్నావు, ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నాకు ఎండ వేడి అసలు పడదు నీకు తెలుసు కదా! బైటకి ఎక్కడికి వెళ్లడం లేదు. రోజూ మన ఇంటి దగ్గరలో అందరికీ మజ్జిగ పంచుతున్నాను. అంతే ఆ తర్వాత ఇంట్లోనే ఉంటున్న. ఎప్పుడైనా బయటకు వెళ్ళవలసి వస్తే సాయంత్రం 6.30 తర్వాత వెళ్తున్న. ప్రస్తుతం ఇది నా పరిస్థితి.
నాన్న! నీకు కిందటి వారం పిల్లల ఆహారం, అలాగే కొన్ని జాగ్రత్తలు చెప్పాను. పిల్లలకు జాగ్రత్తలు ఒక్కో వయసులో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ముందు ముందు వాటి గురించి చెప్తాను. జాగ్రత్తలు ఎంత అవసరమో మంచి అలవాట్లు కూడా అంతే అవసరం.
స్కూల్‌కి పంపించడం మొదలు పెట్టినప్పటి నుండి అంటే ఐదేండ్ల వయసు లేదా మనం చెప్తున్నవి అన్నీ వాళ్లకు అర్ధం అవుతున్నాయి అని తెలిసినప్పుడు స్కూల్‌ నుండి రాగానే బూట్లు విప్పేసి షూ రాక్‌లో పెట్టడం, లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్ళి అంట్లు తోమే చోట పెట్టడం, స్నానం చేయడం, తినే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం, వస్తువు తీసిన చోట పెట్టడం, టిఫిన్‌, భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్స్‌ తీసేయడం లాంటి చిన్న చిన్న పనులు నేర్పాలి. అవే వాళ్లకు పెద్దైన తర్వాత కూడా అలవాటవుతాయి. దీనివలన ఎవరింటికి వెళ్లినా ఇబ్బంది ఉండదు. వాళ్లు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు.
అలాగే ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో కూడా అలవాటు చేయాలి. అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చోమని చెప్పాలి. అలా అయితేనే తీసుకుని వెళ్తాను అనాలి. అలాగే టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తే చెప్పమని, దాహం వేస్తే మంచి నీళ్ళు అడగాలని చెప్పాలి. సోఫాలు, కుర్చీలు ఎక్కకూడదని, వస్తువులు ముట్టుకోకూడదని నేర్పించాలి. కొందరి పిల్లలను చూస్తుంటాను వేరే వాళ్ల ఇళ్లకు వెళ్ళినప్పుడు సోఫాలు ఎక్కి ఎగరడం, వస్తువులు ఏవి కనపడితే వాటిని లాగడం, వస్తువులు పాడుచేయడం చేస్తుంటారు. ఆ అలవాట్లు అస్సలు మంచివి కావు. కొంతమంది నాతో అంటుంటారు
‘మా పిల్లలు చెప్పినా వినరండి’ అని. వినేల, అర్ధం అయ్యేలా చెప్పాలి. లేదా తీసుకెళ్లకుండా ఉండాలి. మన పక్కన ఉండేవాళ్ల ఇద్దరు పిల్లలు వచ్చారంటే వాళ్లు చేసే అల్లరి, పాడు చేసే వస్తువులు తల్చుకుంటే గుండెల్లో దడ వస్తుంది. వాళ్ళగురించి చెప్పాలంటే ఎన్నో వున్నాయి. వాళ్ళ అమ్మ చూస్తూ ఉండేది తప్పితే ఏమీ అనేది కాదు. వాళ్ళను కోప్పడాలి అనుకునేదాన్ని, మళ్ళీ వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందో అని ఆగిపోయేదాన్ని. ఒక సారి మాత్రం కోప్పడ్డాను. విసుగు, కోపం వచ్చేసాయి మరి ఏం చేయను.
పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు, మనం ఎలా తయారు చేస్తే అలా తయారు అవుతారు నాన్న. ఇవన్నీ నేర్పాలి, చెప్పాలి అంటే వాళ్లకు సమయం కేటాయించాలి. వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి. ఇది అందరికీ కుదరక పోవచ్చు. కాని పిల్లలకోసం తప్పనిసరిగా కొంత సమయం పెట్టుకుని వారితో గడపాలి. సరే నాన్న ఉంటాను. ఇప్పటికే చాలా చెప్పాను. వచ్చే ఉత్తరంలో ఇంకా కొన్ని విశేషాలు తెలియచేస్తా..
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి

అమ్మ లేఖ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -