ఎండాకాలం కావడంతో ముందుకురాని దాతలు
ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదంటున్న వైద్య నిపుణులు
ఐపీఎం సహా చాలా బ్లడ్ బ్యాంకుల్లో సమస్య
తలసేమియా బాధితులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రక్తదానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాన్ని కాపాడొచ్చు. అందుకే రక్తదానం చేసే వారిని ప్రాణదాతలుగా పేర్కొంటారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌లో రక్తం నిల్వలు పడిపోయాయి. రక్తం అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతుండగా.. ఇందుకు అనుగుణంగా రక్త సేకరణ లేకపోవడంతో రక్తం నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో తలసేమియా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు.
మార్చి నుంచి రక్తదానం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ, ప్రయివేటు కలిపి దాదాపు 85 వరకు బ్లడ్ బ్యాంకులున్నాయి. ఎన్జీవోలకు సంబంధించి 38 వరకు ఉన్నాయి. ప్రతి ఏడాదీ గ్రేటర్ హైదరాబాద్‌లో దాదావు 4 లక్షల యూనిట్ల వరకు రక్తం అవసరం ఉంటుంది. ప్రస్తుతం కొరత ఏర్పడటంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు పడిపోయాయి. నగరంలో తలసేమియా బాధితులతో కలుపుకుని ఇతర రోగులకు రోజుకు 7-10 వేల యూనిట్ల రక్తం అవసరం ఉండగా.. ప్రస్తుతం సకాలంలో రక్తం అందించలేని పరిస్థితి ఏర్పడింది.
వేసవిలో అధిక కొరత
ప్రతి వేసవిలోనూ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు పడిపోవడం సర్వసాధారమే. కానీ ఈ ఏడాది కొరత తీవ్రంగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎన్జీవోల బ్లడ్ బ్యాంకుల్లో చాలా వరకు రక్తం నిల్వలు తగ్గిపోయాయి. నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో సాధారణ రోజుల్లో 100-150 యూనిట్ల వరకు సరఫరా చేస్తుంటారు. ఇక్కడి నుంచి నిత్యం నిలోఫర్, ఉస్మానియా, పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రులకు పంపుతుంటారు. ప్రస్తుతం రక్తం కొరతతో వీటికి కూడా అత్యవసరమైతే తప్ప బల్క్‌గా సరఫరా చేయడం లేదు. వైద్య శిబిరాల ద్వారా సేకరించిన రక్తం యూనిట్లలో 30 శాతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం వేసవి తరుణంలో శిబిరాలు తగ్గడంతో సేకరణ తగ్గింది. ముఖ్యంగా నెగెటిట్ గ్రూపు బ్లడ్ కొరత ఎక్కువగా ఉంది.
వేసవిలో తగ్గిన వైద్య శిబిరాలు
వేసవిలో కాలేజీలకు సెలవుల వల్ల రక్తదాన శిబిరాలు తక్కువయ్యాయి. దీనికితోడు ఎండా కాలంలో రక్తదానం చేస్తే అనారోగ్యాల బారిన పడతామనే భావనతో చాలా మంది దాతలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితులన్నీ బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గడానికి కారణమని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూడు నెలల వ్యవధితో ఏడాదిలో గరిష్టంగా నాలుగు సార్లు రక్తదానం చేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, విద్యాసంస్థలు, యువజన సంఘాల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ చేస్తారు. ప్రస్తుతం రక్తం కొరతతో కొంత మందికి అందించలేని పరిస్థితి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో తమ వద్ద ఉన్న రక్తదాతల జాబితా నుంచి అవసరమైన గ్రూపు వారికి సమాచారం ఇచ్చి రక్తం సేకరించాల్సి వస్తుందంటున్నారు.
తలసేమియా బాధితులకు తప్పని తిప్పలు
తలసేమియా వ్యాధి బారినపడిన వారికి 20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సకాలంలో రక్తం అందకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారికి దాతల నుంచి సేకరించిన రక్తం చాలా ఉపయోగపడుతుంది. ఈ తలసేమియా బాధితులకు దాదాపు నిత్యం 4 వేల యూనిట్ల రక్తం అవసరం అవుతుంది. ఇందులో తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా సొసైటీ తరపున 50 శాతం, ప్రభుత్వ రక్త నిధుల నుంచి 50 శాతం సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం సరఫరా తగ్గడంతో బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. రక్తాన్ని వివిధ రకాలుగా విడగొట్టి భద్రపరుస్తుంటారు. ఇందులో ఎర్ర రక్తకణాలు యథాస్థితిగా 35-45 రోజులు, ప్లాస్మా గడ్డ కట్టిస్తే ఏడాది, ప్లేట్లెట్లు 5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా రక్తం ఎక్కువ కాలం నిల్వ ఉండే పరిస్థితి ఎక్కువ కేంద్రాల్లో లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడూ క్యాంపులు నిర్వహించి బ్లండ్ బ్యాంకులకు తరలించాలి. ఈ నేపథ్యంలో రక్తం అవసరమయ్యే వారికి ఆరోగ్యవంతులు దానం చేయొచ్చునని నిపుణులు చెబుతున్నారు.



