– సూపర్‌కింగ్స్‌పై 8 వికెట్లతో ఘన విజయం
– ఛేదనలో సాయి సుదర్శన్ ధనాధన్
– చెన్నై 158/7 గుజరాత్ 162/2
వరుస ఓటముల నుంచి గుజరాత్ టైటాన్స్ పుంజుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్ కంచుకోట చెపాక్‌లో 8 వికెట్ల తేడాతో ఆ జట్టుపై ఘన విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో లోకల్ బారు సాయి సుదర్శన్ (87) ఛేదనలో దంచికొట్టాడు. సూపర్‌కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 నాటౌట్) అజేయ అర్థ సెంచరీ చేసినా సూపర్‌కింగ్స్ తొలుత 158 పరుగులకే పరిమితమైంది. సూపర్‌కింగ్స్‌కు 8 మ్యాచ్‌ల్లో ఇది ఐదో ఓటమి, టైటాన్స్‌కు ఇది నాల్గో విజయం.
నవతెలంగాణ – హైదరాబాద్
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ (87, 46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఛేదనలో అర్థ సెంచరీతో చెలరేగాడు. గత మ్యాచ్‌లో శతకంతో మెరిసినా, టైటాన్స్‌కు విజయం అందించని సాయి సుదర్శన్ ఆదివారం సొంతగడ్డ చెపాక్‌లో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (33, 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జోశ్ బట్లర్ (39 నాటౌట్, 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సైతం ఛేదనలో రాణించారు. 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 నాటౌట్, 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. సంజు శాంసన్ (11), సర్ఫరాజ్ ఖాన్ (0), ఊర్విల్ పటేల్ (4), డెవాల్డ్ బ్రెవిస్ (2) విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ (3/25), అర్షద్ ఖాన్ (2/43) వికెట్లు పడగొట్టారు. టైటాన్స్ పేసర్ కగిసో రబాడ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
సాయి సుదర్శన్ సూపర్
159 పరుగుల ఊరించే ఛేదనలో టైటాన్స్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. సాయి సుదర్శన్ (87), శుభ్‌మన్ గిల్ (33) తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఛేదనలో ముందుండి నడిపించిన సాయి సుదర్శన్ సొంత మైదానంలో స్పూర్తిదాయక అర్థ సెంచరీ సాధించాడు. 2 సిక్స్‌లు, 4 ఫోర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన సాయి సుదర్శన్.. టైటాన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. ఓపెనర్లు ఇద్దరూ నిష్క్రమించినా.. జోశ్ బట్లర్ (39 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (1 నాటౌట్) లాంఛనం ముగించారు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో బట్లర్ ఫామ్‌లోకి వచ్చాడు. మరో 20 బంతులు ఉండగానే గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్‌కింగ్స్ బౌలర్లలో అకీల్ హుస్సేన్ (1/46), నూర్ అహ్మద్ (1/29) మాయాజాలం చేశారు.
రుతురాజ్ ఒక్కడే
టాస్ ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన సూపర్‌కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో కగిసో రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. సంజు శాంసన్ (11), ఊర్విల్ పటేల్ (4)లను డగౌట్‌కు చేర్చాడు. తర్వాతి ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ (0)ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో 26 పరుగులకే సూపర్‌కింగ్స్ 3 వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ (2) సైతం నిరాశపరచగా 37/4తో సూపర్‌కింగ్స్ వంద లోపే ఆలౌటయ్యే ప్రమాదంలో పడింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 నాటౌట్) ఆపద్బాందవుడి పాత్ర పోషించాడు. 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో మెరిసిన రుతురాజ్ గైక్వాడ్ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. శివం దూబె (22), కార్తీక్ శర్మ (15), జెమీ ఓవర్టన్ (18)లు ఆఖర్లో విలువైన పరుగులు చేశారు. దీంతో సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ : 158/7 (రుతురాజ్ గైక్వాడ్ 74, శివం దూబె 22, జెమీ ఓవర్టన్ 18, కగిసో రబాడ 3/25, అర్షద్ ఖాన్ 2/43)
గుజరాత్ టైటాన్స్ : 162/2 (సాయి సుదర్శన్ 87, జోశ్ బట్లర్ 39, శుభ్‌మన్ గిల్ 33, నూర్ అహ్మద్ 1/29, అకీల్ హుస్సేన్ 1/46)
సూపర్‌కింగ్స్ అదే వ్యథ
ఐపీఎల్19లో చెన్నై సూపర్‌కింగ్స్ వ్యథ కొనసాగుతుంది. వరుస ఓటములను అధిగమించి.. వరుసగా రెండు విజయాలు సాధించిన సూపర్‌కింగ్స్ ఎక్కువగా సంజు శాంసన్‌పై ఆధారపడుతోంది. సూపర్‌కింగ్స్ నెగ్గిన మ్యాచ్‌ల్లో సంజు శాంసన్ అన్నీ తానై నడిపించాడు. సంజు శాంసన్ బ్యాట్‌తో నిరాశపరిస్తే.. సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ లైనప్ తేలిపోతుంది. టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ అదే కథ పునరావృతమైంది. సంజు శాంసన్ 11 పరుగులే చేయగా, సర్ఫరాజ్ ఖాన్ 0 పరుగులు, ఊర్విల్ పటేల్ 4 పరుగులు, డెవాల్డ్ బ్రెవిస్ 2 పరుగులకే వికెట్ కోల్పోయారు. ఫలితంగా పది ఓవర్లలోనే సూపర్‌కింగ్స్ పరుగుల వేటకు తెరపడింది. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ సూపర్‌కింగ్స్‌కు గౌరవప్రద స్కోరు అందించేందుకు ఒంటరి పోరాటం చేశాడు.
గైక్వాడ్ అర్థ సెంచరీతో మెరిసినా, టైటాన్స్ బౌలర్లపై ఎదురుదాడి చేయలేదు. ఫలితంగా చెన్నై స్పల్ప స్కోరుకే పరిమితమైంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సూపర్‌కింగ్స్ స్పిన్నర్లు ఆశించిన మాయాజాలం చేయలేదు. దీంతో చెన్నై సీజన్లో ఐదో ఓటమి మూటగట్టుకుంది.



