‘ఇంతటితో మీ సేవా కాలం
ముగిసిందని’
ఓ అనివార్యమైన విరమణ లేఖ
పాఠం మధ్యలోంచే నన్ను
నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపింది..!
ఇన్నాళ్ళూ.. నల్లబల్లపై వెలుగులు పూయించిన
నేను ఆ అధికారిక ఉత్తర్వుకి తలవంచాను..!
కాలం ఒకేలా ఉండదు..!
మనిషి దశలను బట్టే స్థితిగతులు
నేనిప్పుడు ఇంటిపట్టునే నాయే
గడియ తీరికలేదు గవ్వ ఆదాయం లేదు
పైగా నా నెత్తిన
తక్షణమే తీర్చాల్సిన అప్పుల చాంతాడు
తోడుగా ఆనారోగ్య సమస్యలు.
అప్పుడెప్పుడో..
రేపటి కాలానికని రెక్కల కష్టాన్ని కొంత
చీమలా పోగేసుకున్న..
ఇప్పుడు.. వాటి విడుదల కోసం ఎదురు చూస్తున్న
ఏవీ..!? ఎంతకీ రావే
విరమణానంతర చెల్లింపులు..!
గ్రాట్యుటీ అనేది జీవితానికి గౌరవ వందనం కోసం
అవి ఏళ్లకు ఏళ్ళు ఆలస్యం అయితే
మేము బతికేది ఎట్లా.!?
చేతులు వణుకుతున్న వయసులో
కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తే,
అది సమాజానికే మచ్చ కాదా?
పిల్లలకు న్యాయం నేర్పిన మేమే
ఇప్పుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం
మొన్నటికి మొన్న..
ఉద్యోగ విరమణ పొందిన ఓ పండుటాకు
ఉత్త చేతులతో ఒత్తిడీకి గురై
గుండె ఆగి రాలింది.!
మీ ఉచితాలకి మా చెమట చుక్కలను మళ్లించడం
అనుచితం కాదా !?
గౌరవంగా జీవించే హక్కు మాకు లేదా
ఇప్పటికైనా..
ఆలకించి ఆలోచించండి ఏలికలారా.!
– నాంపల్లి సుజాత అన్నవరం
మా కష్టార్జితం మా హక్కు
- Advertisement -
- Advertisement -


