Sunday, April 26, 2026
E-PAPER
Homeదర్వాజచేతిలో చెయ్యేసి - సమకాలీన పరిస్థితులు

చేతిలో చెయ్యేసి – సమకాలీన పరిస్థితులు

- Advertisement -

సమాజము- సాహిత్యము బింబ ప్రతిబింబ సమరూపాలనేది ఎవరు కాదనలేని సత్యం. వాస్తవికతకు అతి దగ్గరగా రచించే క్రమంలో కథా ప్రక్రియ కూడా మన అనుభూతులను అనుభవాలను వ్యక్తీకరించే సాధనంగా నిలిచింది. ప్రత్యేకించి కథా ప్రక్రియ ద్వారా సులభశైలిలో ప్రాంతీయ వైవిధ్యాన్ని చూపిస్తూ దేశకాల పరిస్థితులను ప్రజలకు అర్థం చేయించే పని సులభతరం అవుతుంది.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలయి ఆత్మీయత అనురాగాలు అడుగంటిపోతున్నాయి. అందుకు కారణం మనుషుల మధ్య ప్రేమరాహిత్యం, సంపాదన, ఆస్తిపట్ల మమకారం వల్ల మానవత విలువలు పతనం అయిపోవడమే. వాటిని కాపాడాల్సిన బాధ్యత రచయితలదేనంటున్నాడు. ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయుడైన పెరుమాళ్ళ ఆనంద్‌. సాహిత్యభిలాషి, సృజనాకారుడుగా తన కుమారుని పెళ్లి సందర్భంగా తీసుకొచ్చిన కథా సంకలనమిది. ‘పెళ్లంటే నూరేళ్ల పంట’నే నానుడిని రుజువు చేస్తూ నేటి కాలంలో పెళ్లితో ముడివడిన ఆర్థిక, సామాజిక, రాజకీయ, నైతిక విలువలను పరిశీలించి సమాజం సన్మార్గంలో నడవటానికి దారులు వేసే విలువలను చాటి చెప్పటం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

సమాజంలో భాగమైన ఉపాధ్యాయులు ఆ సమాజంలోని ప్రజల అవసరాలను గుర్తించి వాటిని సొంతం చేసుకోవటం అనే మాటలను ఉపాధ్యాయ వృత్తి, ప్రవర్తన నియమావళిలో పేర్కొన్నట్లుగా పెరుమాళ్ళ ఆనంద్‌ ప్రయత్నం సాగింది. ఉపాధ్యాయుడిగా తన ఇంటిలో జరిగే ప్రతి వేడుకను సాహిత్య విలువలతో పుస్తకావిష్కరణ సభలుగా మార్చుకున్నాడు. కూతురు పెళ్లి సందర్భంగా కవితా సంకలనాన్ని, కొడుకు పెళ్లి సందర్భంగా ‘చేతిలో చెయ్యేసి’ కథా సంకలనాన్ని తీసుకొచ్చారు. ”మనిషిని అర్ధం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికి సమాజానికి ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహా రచయితలు కూడా ఎందరో ఉన్నారు”. (వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. కథాశిల్పం. 1989) ఆ ప్రయత్నాలు నల్లగొండ జిల్లాలోని వివిధ సాహిత్య సంస్థల ద్వారా కొనసాగుతూనే ఉన్నాయి. సజన సాహితి, నల్లగొండ వారి ప్రచురణగా ఉభయ రాష్ట్రాలకు చెందిన కథారచయితలు 16 మంది రాసిన కథల సంకలనమిది.

”పెండ్లి ఒక వ్యాపార మార్కెటు-డిగ్రీ కొలది పెరిగే రేటు కట్నమే ఫుల్‌ సర్టిఫికెటు” అని అరుణోదయ వ్యవస్థాపకుల్లో ఒకరైన కానూరు వెంకటేశ్వరరావు ఒక పాట కవిగా పెళ్లి రూపురేఖల్ని, మానవ స్వభావరీతుల్ని, మూఢాచార పద్ధతుల్ని, అనాదిగా వస్తున్న మతమౌఢ్యధర్మాలని ఒక్క చరణం లోనే తెలియజేశారు. సమాజంలోని ఇన్ని రుగ్మతలను ఉద్దేశించి ముందుమాటలో కస్తూరి ప్రభాకర్‌ ”మత కుల కట్టుబాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆయా మతాలు కులాల ఆచార వ్యవహారాలతో ఒరిగే ఒక ఆనంద హేలగా కొందరికి, ఆడపిల్ల పెళ్లి గుండెల మీద కుంపటిలా మారిన వైనం ఇంకొందరి అనుభవంలో చూస్తున్నాం”. అంటారు. ప్రస్తుత సమాజంలో పెళ్లి విషయంలో కులం అడ్డుగోడగా మిగులుతుంది. కులం కాని వారిని, తక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్నప్పుడు పరువు ప్రధాన సమస్యగా మారిన మానవ విలువలు కన్నబిడ్డల్ని చంపుకునే పరిస్థితికి తెచ్చాయి.

మిర్యాలగూడలో పెరుమాళ్ళ ప్రణయ్‌, మంథని మధుకర్‌, అంబోజి నరేష్‌ వంటి హత్యలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్న పోలీసు యువతి నాగమణిని తన సొంత సోదరుడే కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు. ఇలాంటి ఉదాహరణలు అనేకం. వీటికి అడ్డుకట్ట వేయటానికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించగల సమర్థులు ఉపాధ్యాయులే. ఈ విషయాన్ని ‘ప్రేమ అల్లాల్సిన కొత్త కథ’లో డా.ఏనుగు నరసింహారెడ్డి నిరూపించారు. కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని నిర్మించలేమన్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పిన మాటలను ఆచరించాల్సిన సమయమిది.
”వచన రచనలోని కథానిక ప్రక్రియే అన్నింటికంటే ప్రాధాన్యత గలదయింది”. (సరస్వతీదేవి, ఇల్లిందల. మొగలాయి కథలు) సమాజంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగటానికి ఒక కథ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ‘గురుదక్షిణ’ అనే మరో కథలో తుల శ్రీనివాస్‌ కూడా రాజారాం సార్‌ అనే ఒక ఉపాధ్యాయుడి పాత్రకే పెద్దపీటవేశారు. 8వ తరగతి చదువుతున్న శైలజ పాఠశాల మొత్తానికి తెలివైన అమ్మాయి. కానీ పట్నంల కారు షెడ్ల మెకానిక్‌ పని చేసే మేనరికపు అల్లునితో పెళ్లి నిశ్చయించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చదవు ఆపొద్దని, చదువు కోసం ఆర్థిక సహాయం ఎంతైనా చేస్తానన్నా తన ఉపాధ్యాయుడి మాటలు ఈ సమాజానికే సహాయకారిగా నిలబెట్టాయి.

నెల్లూరుకు చెందిన రోహిణి వంజారి రాసిన కథ ‘బంగారు బొమ్మ రావేమే!’. ఇందులో అవంతిక, సంకీర్తన్‌ పాత్రల ద్వారా పెళ్లి సందర్భాన్ని చెబుతూ ఒక సామాజిక బాధ్యతను నేటి తరాలకు గుర్తు చేశారు. పెళ్లి చేసుకుని ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ విదేశాలకు వెళ్ళిపోతే వయసు పెరుగుతున్న తల్లిదండ్రుల మంచి చెడులు చూసేవారు కరువవుతున్నారు. అకాల మరణం సంభవించి మతదేహాలు కుళ్ళిపోయిన చూసేవారు కరువైన వైనం పత్రికల్లో వార్తలవుతున్నాయి. ఇవి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలిపే కథ ఇది.
నిస్వార్థ ప్రేమలు పంచినా జ్ఞాపకాలకు పల్లెటూర్లు పట్టుకొమ్మలు. వాటికి ఉదాహరణే ‘గౌరి’ కథ. సాగర్ల సత్తయ్య సామాజిక బాధ్యతను తనువెల్లా నింపుకున్న కథా రచయిత. బతుకుదెరువు భారమై పిల్లల నమ్ముకునే నల్గొండ జిల్లాలోని పేదల పరిస్థితులను ప్రపంచానికి చాటి చెప్పాడు. పొలం దగ్గరికి వెళ్తున్న లక్ష్మయ్యకు చెరువు కట్టమీద మైసమ్మ గుడి పక్కన దొరికిన పసిబిడ్డ(గౌరి)ను పెంచుకోవడం రామడుగు గ్రామ ప్రజల బాధ్యతగా మారింది. అంతేకాదు కులం ఏమిటో తెలువని, తల్లిదండ్రులు లేని, కట్నకానుకలు ఇవ్వలేని గౌరికి సంబంధాలు దొరకవు. కానీ, ‘కులంతోసంబంధం లేకుండా గుణం ఉంటే చాలని’ భావించిన ఆదర్శ భావాలున్న ధనిక భూస్వామ్య కుటుంబానికి చెందిన గౌతమ్‌ గౌరీకి తోడునీడయ్యాడు. నిజమే ఈ కథ ఉన్నత చదువరులకు సమాజంపై ఉన్న బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది. ”ప్రపంచంలో మానవత్వం మగ్యమవుతుందని ఎన్నో చోట్ల నిరూపణ అవుతున్న ఈ రోజుల్లోనూ పల్లెల్లో ఈ ప్రేమాభిమానాలు బతికే ఉండడం పెళ్లి వేడుకకు వచ్చిన బంధువులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేసింది”. డబ్బున్న వారు ఆడంబరాలతో వృధా ఖర్చులు చేస్తారు కానీ పేదవారి కష్టానికి చేయూతనందించరు. అలాంటి వారికి కనువిప్పు కలిగించే అద్భుత కథనే గౌరి.

అడ్డదారిలో వచ్చే ఆస్తుల సౌకర్యం లేని ఉద్యోగమంటు ఉపాధ్యాయ వృత్తి కున్న గౌరవం మానవ సమాజంలో ఉన్నతమైంది. అంతేకాదు ఆ కుటుంబాలు క్రమశిక్షణకు నిదర్శనాలు. ఒకరకంగా ఆర్థిక అంతరాలు లేని సమాజాన్ని కూడా నిర్మించగలవు. అదే ఆశాభావ జీవితం నుండి రాసిన కథ ‘వెన్నెల కురిసింది’. ఎస్‌ఎస్‌సిలో సెలెక్ట్‌ అయిన తన కూతురికి ఇక అత్త పోరు ఆడబిడ్డల పోరు, భర్త పోరు వుండదని తండ్రితో రచయిత పెరుమాళ్ల ఆనంద్‌ చెప్పించిన తీరు ఆలోచింప జేస్తుంది. ఆర్థిక అంశాలే కాదు, మానవ విలువలు ఉన్నతమైనవని చాటి చెప్పిన కథబిల్లా మహేందర్‌ రాసిన ‘గాయత్రి పెళ్లి’.
ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయిన వారసులు లేరని, అక్రమ సంబంధాలని, వరకట్నం తేలేదని నింద వేయాల్సిన సందర్భములో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు కొందరు. అట్లాంటి ఇతివత్తంతో సాగినదే’బతుకు గీత’ ఈ కథలో మండల స్వామి కమల జీవిత గాధను చిత్రించాడు.
మేరెడ్డి యాదగిరిరెడ్డి రాసిన ‘చదువు’ కథ కూడా ఆనాటి రాజకీయ పరిస్థితులను గుర్తుచేస్తుంది. ఊరి సర్పంచి భూపాల్‌ రెడ్డి ఇచ్చిన సహకారంతో బడిని ఆట వస్తువుగా మలుచుకున్న కొందరి ఉపాధ్యాయుల నిర్లక్ష్య ధోరణి తెలుస్తుంది. నిజాయితీపరుడైన కష్ణమూర్తి సార్‌ పై మిగతా ఉపాధ్యాయులు, చదువు విలువ తెలియని బడి దొంగల రాజకీయ చదరంగంలో బందీ అవ్వకుండా గుండాల చేతిలో బతుకుచిద్రం అయిపోయే విద్యార్థిని రాధకు కృష్ణమూర్తి సారే జీవిత సహచర్యమిచ్చాడు.

”ఇద్దరు వ్యక్తుల మధ్య గాని, రెండు అంశాల మధ్య గాని, రెండు భావాల మధ్య గాని, రెండు వర్గాల మధ్య గాని సంఘర్షణ అనేది తప్పకుండ ఉంటుంది”. త్రివేణి మన వ్యాస సంపుటిలో అంటుంది. ఇదే భావనతో కింది కథ కనిపిస్తుంది. ‘పిల్లగాని పెళ్లి’ కథలో బోధనం నర్సిరెడ్డి కమ్యూనిస్టు కోణంలో వర్గ పోరాట దక్పథాన్ని, అట్టడుగు వర్గాల దృష్టిలో వర్ణ దృక్పథాన్ని తెలిపాడు.
‘మలుపు తిరిగిన జీవితం’ కథలో తండు కృష్ణ కౌండిన్య నైతిక విలువలను భావితరాలకు ధార పోశారు. కొద్ది రోజుల్లో పెళ్లి కావలసిన ‘లత’ జీవితం ఆకతాయిల ఉత్తరంతో గందరగోళంలో పడింది. మగవారి కంటే ఆడబిడ్డ ఎందులో తక్కువ కాదనే సవాళ్లతో నాయనమ్మ ద్వారా దాంపత్య జీవితం అనుభవ పాఠాలు నేర్వడం మానసిక ధైర్యాన్ని పొందడం వంటిది ఈ కథలో చూడొచ్చు.
శీలం భద్రయ్య రాసిన ‘నెమలి నవ్వింది’ కథ మయూరి పాత్రలో నైతిక విలువలను చాటిచెప్పింది. గౌడ వృత్తి చేసి తండ్రి చనిపోతే అమ్మే కుటుంబ భారాన్ని మోసింది. అవసరాన్ని తీర్చడంలో బాధ్యతగా నిలిచింది. చివరికి ఈ కథ ‘ఎంచుకున్న ఆశయం నమ్ముకున్న కష్టం వమ్ము కాద’ని గుర్తుచేస్తుంది.
పెళ్లి కార్యక్రమాలకు పెద్దలు ఇచ్చే సలహాలు చాదస్తపు మాటలుగా భావిస్తాం. కానీ వాటిని తెలుగు ప్రజల సంస్కృతి గొప్పదని తెలిపే క్రమంలో ‘నూరేళ్లపంట’ కథలో ఉప్పల పద్మ పునః ప్రయత్నం చేశారు. ‘షష్టిపూర్తి’ కథలో పొట్ట బత్తుల రామకృష్ణ కొత్తదారిని చూపించాడు. భిన్న శైలిలో భిన్న భావాలు గల పెళ్లి అనే ఇతివత్తాన్ని ఎంచుకొని ప్రతి కథకుడు రాసిన కథ ద్వారా తమ జీవితంలోని సుదీర్ఘమైన అనుభవాలే సాహితీ లోకంతో పంచుకోవటానికి కథలుగా మలచబడ్డాయని తెలుస్తుంది.
సమాజంలో జరుగుతున్న పెళ్లి సందర్భాలు మనల్ని అనేక ఆలోచనల్లో ముంచెత్తుతాయి. వాటిని సూక్ష్మ దష్టితో పరిశీలించినప్పుడు బండారు శంకర్‌ ‘చేతిలో చెయ్యేసి’ కథలో చెప్పిన విషయం యదార్ధమని తేలుతుంది. ‘అసలు సమాజంలో ఉన్నది కులవివక్ష కాదు కలిమిలేముల వివక్ష’ అన్నారు. నిజమే జీవిత భాగస్వామి ఎంపికలో పెళ్లనే నూరేళ్ల పంటలో వివక్ష ఎంత కాలం? దానిని ఎదిరించేందుకు మనలో అంతరాలులేని ఐక్యత భావం కలిగేంతవరకే.

డా. సి. అనిత కుమారి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
ఎం.జి. యూనివర్సిటీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -